వరదలో చిక్కుకుపోయిన యువకులు.. కాపాడిన రెస్క్యూ టీం

Update: 2023-07-26 08:41 GMT

రాజస్థాన్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షాలతో వాగులు, వంకలు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల వంతెనల పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. తాజాగా ఉదయ్ పూర్లో బైక్పై వంతెన దాటేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులు వరదలో చిక్కుకున్నారు. రెస్క్యూ టీం అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఉదయ్ పూర్ సమీపంలోని మోర్వానియా టౌన్లో వాగు ఉప్పొంగింది. వరద నీరు బ్రిడ్జిపై నుంచి ప్రవహించింది. అదే సమయంలో వంతెన దాటుతున్న ఇద్దరు యువకులు వరదలో చిక్కుకుపోయారు. నీటి ప్రవాహ ఉద్ధృతికి బైక్ కొట్టుకుపోగా అదృష్టవశాత్తూ ఆ ఇద్దరు యువకులు బ్రిడ్జిపైనున్న ఓ దిమ్మెను పట్టుకున్నారు.

యువకులు బ్రిడ్జిపై చిక్కుకుపోయిన విషయం గుర్తించిన స్థానికులు సివిల్ డిఫెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న టీం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. భారీ హైడ్రాలిక్ క్రేన్ తెప్పించి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత బైక్ను కూడా వెలికి తీసినట్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సివిల్ డిఫెన్స్ టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Tags:    

Similar News