నాలుగేళ్ల జగన్‌ పాలన అంతా అవినీతిమయం : అమిత్‌ షా

Update: 2023-06-11 15:36 GMT

జగన్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా విశాఖలోని రైల్వేగ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా.. జగన్ నాలుగేళ్ల పాలన అంతా అవినీతిమయమని విమర్శించారు. కేంద్రం ఇస్తున్న ఇళ్లకు జగన్‌ పేరు పెట్టుకున్నారని ఆరోపించారు. వైసీపీ వచ్చాక విశాఖ అరాచక శక్తులకు అడ్డాగా మారిందని మండిపడ్డారు.

రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని.. ఈ విషయంలో జగన్ సిగ్గుపడాలని అమిత్ షా అన్నారు. ఉచితంగా ఇచ్చే బియ్యం పైన జగన్‌ ఫొటోలా అని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధికి పదేళ్లలో రూ.5 లక్షల కోట్లు ఇచ్చామని.. అన్ని లక్షల కోట్ల అభివృద్ధి రాష్ట్రంలో కనిపిస్తుందా..? అని అడిగారు. ఆ డబ్బంతా జగన్ ప్రభుత్వ అవినీతి ఖాతాల్లోకే వెళ్తోందని ప్రజలు గమనించాలని సూచించారు. ఏపీలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో భూ మాఫియా, మైనింగ్‌ మాఫియా చెలరేగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీకి రెండు వందే భారత్ రైళ్లను ఇచ్చామన్న అమిత్ షా.. విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు చేపట్టామని చెప్పారు. విశాఖ, కాకినాడ, తిరుపతి, అమరావతిని స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ వచ్చాక మనదేశం పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోందని అమిత్ షా అన్నారు. యూపీఏ పాలనలో 12లక్షల కోట్ల అవినీతి జరిగిందని.. కానీ మోడీపై ఒక్క అవినీతి ఆరోపణ లేదని చెప్పారు. అ 2024 బీజేపీదే అధికారమని.. 300 స్థానాలతో మోడీ మళ్లీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ నుంచి కూడా 20 సీట్లు ఇవ్వాలంటూ అమిత్ షా ప్రజలను కోరారు.


Tags:    

Similar News