Seasonal Hindus:వాళ్లు సీజనల్ హిందువులు.. కాంగ్రెస్‌కు కేంద్ర మంత్రి కౌంటర్లు

Byline :  Veerendra Prasad
Update: 2024-01-11 06:17 GMT

ఈ నెల(జనవరి) 22న అయోధ్యలో జరిగే రామ మందిరం 'ప్రాణ ప్రతిష్ఠ' వేడుకకు హాజరవ్వాల్సిందిగా అయోధ్య పంపిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​/బీజేపీ రాజకీయ ప్రాజెక్ట్​గా అభివర్ణిస్తూ.. ఆ వేడుకకు దూరంగా ఉంటున్నామని తెలిపింది. అయితే కాంగ్రెస్ అగ్రనేతలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్.. కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఈ ప్రజలు(కాంగ్రెస్ నేతలు) సీజనల్ హిందువులు. కేవలం ఓట్లు కావాలని భావించనప్పుడే, ఆ సమయంలో స్వచ్ఛమైన హిందువులుగా మారడానికి ప్రయత్నిస్తారు. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత కాంగ్రెస్‌లో ఎవరూ అయోధ్యకు వెళ్లలేదు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండే పనిని కాంగ్రెస్ పార్టీ స్వయంగా చేసింది, కాబట్టి వారికి అయోధ్యకు వెళ్లే నైతిక బలం లేదు, ”అని జాతీయ మీడియా సంస్థకి తెలిపారు.

ప్రాణ ప్రతిష్ట వేడుకను ‘ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీ కార్యక్రమం’గా పేర్కొంటూ, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, లోక్‌సభ ఫ్లోర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని బుధవారం కాంగ్రెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిపై పలువురు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. "కాంగ్రెస్ పార్టీ 'రామ వ్యతిరేక వైఖరి' దేశ ప్రజలందరికీ తెలిసింది. రాముడు కల్పిత పాత్ర అని సోనియా గాంధీ నేతృత్వంలో న్యాయస్థానంలో అఫిడవిట్ వేసిన ఆ పార్టీ ఇప్పుడు రామాలయం ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాన్ని తిరస్కరించడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. సోనియా గాంధీ, కాంగ్రెస్ నేతృత్వంలోని 'I N D I A' కూటమి మరోసారి సనాతన ధర్మాన్ని అవమానించింది. ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాన్ని తిరస్కరించడం ఇండియా కూటమి నేతల సనాతన ధర్మ వ్యతిరేక మనస్తత్వాన్ని తెలియజేస్తుంది." అని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ మండిపడ్డారు. మరోవైపు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి అందిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడం అంటే.. భారత్ దేశ గుర్తింపు, సంస్కృతిని పక్కనబెట్టడమే అని తెలిపారు. ఇలాంటి వాటి వల్లే కాంగ్రెస్ పరిస్థితి దిగజారిందని అన్నారు.

Tags:    

Similar News