punishment : విద్యార్థులకు ప్రిన్సిపల్‌ పనిష్మెంట్.. అధికారులు సీరియస్

Byline :  Veerendra Prasad
Update: 2023-12-20 04:01 GMT

 చలికాలం వచ్చిందంటే చాలామంది ఉదయాన్నే స్నానం చేసేందుకు జంకుతారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే పిల్లలైతే కొందరు అలాగే వెళ్లిపోతుంటారు. తాజాగా కొందరు విద్యార్ధులు స్నానం చేయకుండా తరగతులకు హాజరయ్యారు. గమనించిన ప్రిన్సిపల్‌ వారికి వినూత్న శిక్ష విధించాడు. కాలేజీ ఆవరణలోని పంపుసెట్టు వద్ద విద్యార్ధులతో బలవంతంగా స్నానం చేయించాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ ఛత్రపతి శివాజీ ఇంటర్‌ కాలేజీకి చెందిన కొందరు విద్యార్ధులు స్నానం చేయకుండానే తరగతులకు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్‌.. కాలేజీ ఆవరణలోని పంపుపెట్టు వద్ద ఉన్న తొట్టెలో నీళ్లు నింపి వారితో బలవంతంగా స్నానం చేయించారు. చలిలో వణుకుతూ విద్యార్ధులు చల్లని నీళ్లతో స్నానం చేయవల్సి వచ్చింది. మొత్తం ఐదుగురు విద్యార్ధులతో పంప్‌సెట్టు వద్ద ఉదయం 10 గంటల సమయంలో స్నానం చేయించారు. దీనిని ఆయనే స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

ఉదయం ప్రార్థన సమయంలో అపరిశుభ్రంగా కనిపించిన కొందరు విద్యార్ధులను గమనించిన ప్రిన్సిపల్‌ ఈ మేరకు కాలేజీ ఆవరణలోనే స్నానం చేయాలని ఆదేశించారు. పైగా కాలేజీకి వచ్చే ముందు ప్రతి రోజూ స్నానం చేసి వస్తానని విద్యార్ధుల చేత ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్ధులకు చలి భయాన్ని పోగొట్టి, క్రమశిక్షణను అలవరచడానికే అలా చేశానని ప్రిన్సిపల్‌ రణ్‌విజయ్‌సింగ్‌ యాదవ్‌ తన చర్యను సమర్ధించుకున్నారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్లు ప్రిన్సిపల్ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విద్యార్ధులను భౌతికంగా శిక్షించడం నేరమని, అవసరమైతే వారి తల్లిదండ్రులను పిలిచి చెప్పాలని అధికారులు తెలిపారు.




Tags:    

Similar News