శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేశాడంటే.. ‘తలపండు’..

Update: 2023-08-16 03:06 GMT

హద్దు మీరిన భక్తి మూఢభక్తిగా మారి ప్రాణాలను బలితీసుకుంటోంది. పరమశివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి ఓ వ్యక్తి తల నరుక్కున్నాడు. ‘తలపండు’ సమర్పిస్తే దేవుడు కరుణిస్తాడనే పిచ్చితో ఫ్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. కుటుంబ సభ్యులు సకాలంలో గుర్తించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో జిల్లాలో మంగళవారం ఈ సంఘటన జరిగింది.

రఘునాథ్‌పురా గ్రామానికి చెందిన దీపక్ కుశ్వాహా అనే 30 ఏళ్ల యువకుడికి భక్తి ఎక్కువ. పరమశివుడికి కానుకగా తన తలను సమర్పించుకోవాలనుకున్నాడు. తెల్లవారుజామున ఆలయానికి వెళ్లి చెట్లను నరికే ఎలక్ట్రిక్ రంపంతో మెడ కోసుకుని నెత్తుటి మడుగులో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే కట్టుకట్టి ఝాన్సీ మెడికల్‌ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని, ప్రాణం కాపాడటానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని వైద్యులు చెప్పారు. కూలిపని చేసుకునే దీపక్‌కు ఇద్దరు పిల్లలు. శివుడంటే అపార భక్తి. రాత్రిపూట కూడా పూజలు చేస్తుంటాడు. తల నరుక్కుంటే శివుడు ప్రత్యక్షమవుతాడని, త్వరలోనే ఆ పని చేస్తానని చెప్పేవాడని అతని తండ్రి పల్తూరామ్ చెప్పాడు. ‘‘మెడ నరుక్కోవడం పిచ్చిపని. అంత భక్తి ఉంటే పూజలు చేసుకో. నువ్వు పోతే పిల్లలు అనాథలవుతారు అని మందలించాను. నెలరోజుగా శివజపం చేస్తున్నాడు. పుస్తకాల్లో శివుడి స్తోత్రాలు రాసుకుంటున్నాడు’’ అని తెలిపాడు. దీపక్ మెడ కోసుకుంటూ ‘జై భగవాన్‌ శంకర్‌’ అని అరిచినట్లు అతని బాబాయి చెప్పాడు.

Tags:    

Similar News