ఇంటి ఖర్చులపై నిలదీసిన భర్త.. కట్టేసి కొట్టిన భార్య

Update: 2023-07-08 16:18 GMT

ఓ వ్యక్తి ఇంటికి దూరంగా ఉండి పనిచేస్తూ డబ్బులు పంపుతున్నాడు. ప్రతి నెల క్రమం తప్పకుండా తన భార్యకు డబ్బులు పంపేవాడు. ఈ క్రమంలో ఇంటికి వచ్చిన అతడు.. ఇంట్లో డబ్బులు లేకపోయేసరికి ఖర్చులపై భార్యను నిలదీశాడు. భార్య సమాధానం చెప్పకపోగా.. కట్టేసి చితక్కొట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

కాన్పూర్ దేహత్‌ జిల్లాకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి బనారస్‌లో ఉంటున్నాడు. సోదరుడితో కలిసి కుల్ఫీ అమ్ముతున్నాడు. వచ్చిన డబ్బులను ప్రతి నెలా సొంతూరులోని తన భార్య సుశీలకు ఇంటి ఖర్చుల కోసం పంపుతున్నాడు. అతడు ఇటీవల బనారస్‌ నుంచి తన సొంతూరుకు తిరిగివచ్చాడు. సుమారు 8 క్వింటాళ్ల గోధుమలను తనకు చెప్పకుండా అమ్మడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే ఇంటి ఖర్చుల కోసం తాను పంపిన 32వేలు ఏమయ్యాయని ప్రశ్నించాడు. ఆ డబ్బు దేనికి ఖర్చు పెట్టిందో చెప్పాలని నిలదీశాడు.

భర్త నిలదీయంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భార్య.. తన సోదరితో కలిసి అతడిని కట్టేసి చితక్కొట్టింది. ఈ దాడిలో శివకుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత అతడు భార్యపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Tags:    

Similar News