వీడేం మొగుడండీ..ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎక్కువని ఏకంగా భార్యనే...
సోషల్ మీడియా ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అనుమానం పెనుభూతంగా మారి పచ్చని కాపురాన్ని ముక్కలు చేసింది. ఇంకా లోకం తెలియని చిన్నారులకు తల్లిని దూరం చేసింది. తనకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో భార్యకు ఎక్కువ ఫాలోవర్స్ ఉండటాన్ని సహించలేకపోయిన ఓ భర్త ఈర్ష్యతో క్షణికావేశంలో తనవెంటే ఏడు అడుగులు వేసిన భార్యను అతి కిరాతకంగా హతమార్చాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఉత్తర్ప్రదేశ్ లక్నోలో ఈ దారుణం జరిగింది. టూర్ అండ్ ట్రావెల్ ఏజెన్సీ బిజినెస్ చేస్తున్న ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పారా ప్రాంతంలో నివాసముంటున్నాడు. గృహిణి అయిన భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తుంటుంది. ఆమెకు పాలోవర్స్ కూడా భారీగా ఉన్నారు. అయితే తనకంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ భార్యకు ఉండటాన్ని చూసి ఆ భర్త సహించలేకపోయాడు. దీంతో విషయం అర్థం చేసుకున్న బార్య భర్త అకౌంట్ ను బ్లాక్ చేసింది. దీంతో ఆ వ్యక్తికి మరింత కోపం తెప్పించింది. ఈ అంశంలో తరచుగా వీరిద్దరి మధ్య గొడవలు జరిగేవి. దీంతో భార్యపైన అనుమానాన్ని పెంచుకున్నాడు.
ఆదివారం పిల్లలు, భార్యతో కలిసి బయటికి వెళ్లిన భర్త మార్గ మధ్యలో సుల్తాన్‌పూర్‌లో కారు ఆపాడు. భార్యతో గొడవకు దిగాడు. దీంతో కోపంతో పిల్లల ముందే భార్యను గొంతు నులిమి చంపేశాడు. కాసేపు అక్కడే కారులో ఉండిపోయాడు. ఈ విషయాన్ని స్థానికులు పెట్రోలింగ్ బృందానికి సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి తనిఖీలు చేయగా అసలు విషయం బయటపడింది. తమ కళ్ల ముందే అమ్మను నాన్ని చంపాడని పిల్లలు పోలీసులకు తెలిపారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.