అతని వయసు 27. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొన్నాళ్లుగా సంబంధాలు చూస్తున్నా ఎక్కడా సెట్ కాలేదు. దీంతో కొందరు పెద్దలు శివయ్యకు ప్రీతికరమైన శ్రావణ మాసంలో పూజలు చేస్తే పెళ్లి అవుతుందని చెప్పారు. వారి చెప్పినట్లే నిత్యం శివునికి అభిషేకం చేసి పూజలు చేశాడు. శ్రావణ మాసం పూర్తైంది. కానీ పెళ్లి చేసుకునేందుకు పిల్ల మాత్రం దొరకలేదు. దీంతో భక్తితో పూజ చేసినా అనుగ్రహించని భోళా శంకరుడిపై అతనికి కోపం వచ్చింది. తన కోరిక నెరవేర్చని శివయ్యకు ఎవరూ పూజలు చేయొద్దంటూ ఏకంగా శివలింగాన్ని కిడ్నాప్ చేశాడు.
ఉత్తరప్రదేశ్‌లోని కౌశుంబిలో ఈ వింత ఘటన జరిగింది. మహేవాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్హియావాన్ మార్కెట్‌కి చెందిన 27 ఏళ్ల చోటూ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఎన్ని సంబంధాలు చూసినా సెట్ కాకపోవడంతో చివరకు పెద్దలు చెప్పినట్లు స్థానిక భైరవ బాబా మందిరంలో శివుడికి పూజ చేశాడు. శ్రావణ మాసం పూర్తయ్యే వరకు నిత్యం సూర్యోదయానికి ముందే శివలింగానికి జలాభిషేకం చేశాడు. శ్రావణ మాసం పూర్తైనా పెళ్లి కుదరకపోవడంతో చోటూకు దేవుడిపై కోపం వచ్చింది. అంతే నేరుగా ఆలయంలోకి వెళ్లి శివలింగాన్ని పెకిలించి తీసుకెళ్లాడు. ఆలయం బయట ఒకచోట వెదురు బొంగులు, ఆకులతో కప్పేశాడు.
తర్వాతి రోజు ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు శివలింగం కనిపించకపోవడంతో షాకయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా.. చోటూ శివలింగాన్ని తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఆ పని ఎందుకు చేశావని ప్రశ్నించగా అతను చెప్పిన కారణం విని షాక్ తిన్నారు. చోటూ శివలింగాన్ని దాచిన చోటుకు వెళ్లి శివలింగాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చోటూపై ఐపీసీ సెక్షన్ 379, 411 కింద కేసు నమోదుచేశారు.