ATM withdrawal : లక్ష వరకు పేమెంట్.. స్కాన్ చేస్తే చాలు నగదు విత్ డ్రా
మొబైల్స్ ద్వారా ఇన్‌స్టాంట్ మనీ ట్రాన్స్‌ఫర్ కోసం ఉపయోగించే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)కు ఎంతటి ఆదరణ ఉందో అందరికి తెలిసిందే. దేశంలో అత్యంత వేగంగా ఈ డిజిటల్ పేమెంట్ మోడ్ విధానానికి జనాలు అలవాటు పడిపోయారు. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) ప్రాధాన్యతను గుర్తించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యుపీఐ పేమెంట్ మోడ్‌కు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. UPI చెల్లింపుల పరిధిని మెరుగుపరచడానికి, ఆర్‌బీఐ జనవరి 1, 2024 నుండి కొన్ని మార్పులను తీసుకొచ్చింది. UPI లావాదేవీల రోజువారీ చెల్లింపు పరిమితిని గరిష్టంగా రూ. 1 లక్షకు పెంచింది. అలాగే ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు యాక్టివ్‌గా లేని UPI IDలను, నంబర్‌లను డీయాక్టివేట్ చేయమని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), Google Pay, Paytm, Phone Pe మొదలైన చెల్లింపు యాప్‌ల సంస్థలతో పాటు బ్యాంకులను కోరింది. UPI చెల్లింపుల వినియోగాన్ని విస్తృతం చేయడానికి RBI డిసెంబర్ 8, 2023 నుండి ఆసుపత్రులు, విద్యా సంస్థల UPI చెల్లింపుల లావాదేవీ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచింది.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)లో జరిగే మోసాలను అరికట్టడానికి, వినియోగదారుడు ఇంతకు ముందు లావాదేవీలు జరపని మరో వినియోగదారుకు మొదటి చెల్లింపులో రూ. 2,000 కంటే ఎక్కువగా పంపకుండా పరిమితి విధించింది.
త్వరలో UPI 'ట్యాప్ అండ్ పే' ఫంక్షనాలిటీని కూడా అందుబాటులోకి తీసుకురానుంది. జపనీస్ కంపెనీ హిటాచితో కలిసి RBI దేశమంతటా UPI ATMలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ATMలలో QR కోడ్‌ను స్కాన్ చేసి వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతా నుండి సులభంగా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు.