బైడెన్ కాన్వాయ్ డ్రైవర్ అరెస్ట్.. ఇంతకీ అతనేం చేశాడంటే..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్ డ్రైవర్ను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో సెక్యూరిటీ సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారు. బైడెన్ కాన్వాయ్ లోని కొన్ని కార్లు అమెరికా నుంచి రాగా మరికొన్నింటిని భారత్లోనే కేటాయించారు. వీటిని ట్రావెల్ ఏజెన్సీల వద్ద ప్రభుత్వం కిరాయికి తీసుకుంది.
బైడెన్ కు హోటల్ ఐటీసీ మౌర్యలో బస ఏర్పాటు చేశారు. ఆయనకు కేటాయించిన కార్లు అక్కడే ఉండాల్సి ఉండగా.. అందులో ఒక యూఏఈ క్రౌన్ ప్రిన్స్ అల్ నహ్యాన్ ఉన్న తాజ్ హోటల్ వద్ద కనిపించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు సదరు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే తాను ఓ బిజినెస్ మేన్ ను డ్రాప్ చేసేందుకు తాజ్ హోటల్ కు వచ్చానని చెప్పాడు. ప్రొటోకాల్ గురించి తనకు తెలియదని అన్నాడు. ఈ క్రమంలో సదరు డ్రైవర్ ను కొన్ని గంటల పాటు ప్రశ్నించిన సెక్యూరిటీ బలగాలు అనంతరం అతన్ని విడిచిపెట్టాయి.
ఇదిలా ఉంటే జీ 20 సదస్సులో పాల్గొన్న అనంతరం యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ వియత్నాం బయలుదేరి వెళ్లారు. ఆదివారం ఉదయం రాజ్ ఘాట్లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళి అర్పించిన అనంతరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో వియత్నాకు బయలుదేరి వెళ్లారు. బైడెన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.