Mary Millben : బీహార్‌ సీఎం నితీశ్‌ వ్యాఖ్యలపై అమెరికన్‌ సింగర్‌ ఫైర్‌

Byline :  Veerendra Prasad
Update: 2023-11-09 08:22 GMT

జనాభా నియంత్రణపై బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ (Nitish Kumar) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పలు రాజకీయ పార్టీల నేతలు ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో నితీశ్‌ వ్యాఖ్యలపై అమెరికన్‌ సింగర్ (US Singer)‌, ఆఫ్రికన్‌-అమెరికన్‌ నటి మేరీ మిల్బెన్‌ (Mary Millben) తాజాగా స్పందించారు. సీఎం వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఓ భారత పౌరురాలిని అయి ఉంటే.. బీహార్‌ సీఎం పదవికి పోటీ చేసి ఉండేదాన్నని పేర్కొన్నారు.

'ప్రస్తుతం ఇండియాలో ఎన్నికల సీజన్‌ మొదలైంది. కాలం చెల్లిన ఆలోచనలకు ముగింపు పలికాల్సిన సందర్భం ఇది. అభివృద్ధి వైపు అడుగులు వేసేలా, ప్రగతి పథంలో దేశాన్ని ముందుకు నడిపించే అవకాశాన్ని ఈ ఎన్నికలు కల్పిస్తాయి. ఇప్పుడు బిహార్‌ రాష్ట్రంలో మహిళలకు విలువనివ్వడమనేది సవాలుగా మారింది. దీనికి ఒకటే సమాధానం ఉందని నా నమ్మకం. నీతీశ్‌జీ వ్యాఖ్యల తర్వాత.. బిహార్‌ ముఖ్యమంత్రి పదవి కోసం ఒక ధైర్యవంతురాలైన మహిళ ముందుకు రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. నేను భారతీయ మహిళను అయ్యుంటే.. బిహార్‌కి వెళ్లి ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసుండేదాన్ని. నీతీశ్‌ కుమార్‌ రాజీనామా చేయాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నాను.బీహార్‌లో నాయకత్వానికి ఓ మహిళకు సాధికారత కల్పించాలని నేను కోరుతున్నా. జవాన్‌ చిత్రంలో షారుఖ్‌ ఖాన్‌ చెప్పినట్టు ఓటు వేసి మార్పు తీసుకురావాలి’ అని మిల్బెన్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇటీవల బిహార్‌ లో నిర్వహించిన కులగణన రిపోర్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే సందర్భంగా నీతీశ్‌( Nitish Kumar) మాట్లాడుతూ.. ‘చదువుకున్న మహిళకు భర్తను ఎలా నియంత్రించాలో తెలుసు’ అని కొంత అభ్యంతరకర భాషలో మాట్లాడారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఏకంగా ప్రధాని మోదీ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. మిల్బెన్‌ సుదీర్ఘ పోస్టు పెట్టారు.



Tags:    

Similar News