ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం.. ఆక్సిజన్ మాస్క్లో మంటలు.. రోగి మృతి
రోగి ప్రాణాలు కాపాడాల్సిన మాస్క్.. ప్రాణం తీసింది. సిబ్బంది నిర్లక్ష్యం.. పాతికేళ్లు కూడా నిండని వ్యక్తి ప్రాణం తీసింది. ఆక్సిజన్ మాస్క్ కు మంటలు అంటుకోవడంతో రోగి మృతి చెందిన ఘటన.. రాజస్థాన్ కోట పట్టణంలోని ఓ గవర్నమెంట్ హాస్పిటల్ లో చోటుచేసుకుంది. వైభవ్ శర్మ (23) అనే వ్యక్తి అనారోగ్యంతో న్యూ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో చేరాడు. ఐసీయూలో ఉన్న వైభవ్ కు బుధవారం రాత్రి డాక్టర్లు డైరెక్ట్ కరెంట్ కార్డియోవెర్షన్ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు.
ఆ తర్వాత కొంత సమయానికి ఆక్సిజన్ మాస్క్ లో మంటలు వచ్చాయి. దీంతో ఆ మంటల్లో చిక్కుకున్న వైభవ్ మృతి చెందాడని అతడి బంధువులు తెలిపారు. వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని ఆరోపిస్తున్నారు. అయితే డాక్టర్లు మాత్రం వైభవ్ బంధువుల ఆరోపణల్ని ఖండించారు. వైభవ్ కు టీబీ ఉందని, ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్లే అతడు చనిపోయాడని తెలిపారు. ఆక్సిజన్ మాస్క్ లో మంటలు రావడం వాస్తవమని, కానీ, అతని మృతికి కారణం మాత్రం అది కాదని పేర్కొన్నారు.