Ayodhya : రేపు సెలవు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలకు వీహెచ్‌పీ విజ్ఞప్తి
అయోధ్యలో రేపు రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రలు సెలవులు ప్రకటించాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వలు కూడా హాలీడే ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. రేపు సెలవు ఇవ్వడం వల్ల ప్రజలు పండుగ వాతావరణంలో రామాలయ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించుకునే వీలుంటుందని వీహెచ్‌పీ ప్రభుత్వన్నికి సూచించింది. శతాబ్ధాలుగా ఎదురు చూస్తున్న కల సాకారమవుతున్న మహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జనవరి 22న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఆఫ్ డే సెలవు ప్రకటించింది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని.. ఉత్తరప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్తి రోజు.. హర్యానా, చత్తీస్ గఢ్, త్రిపుర, ఒడిశా, గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లో హాఫ్ డేను అధికారిక సెలవుగా ఆయా ప్రభుత్వాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో.. తెలంగాణలోని విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించాలని అడ్వకేట్ శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో శ్రీనివాస్ కోరారు. కాగా.. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలు సైతం జనవరి 22న సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని బండి సంజయ్ కోరారు. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం దేశ ప్రజలంతా ఎంతో భక్తిశ్రద్ధలతో ఎదురుచూస్తున్నారని బండి సంజయ్ వెల్లడించారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని రాజకీయం చేయకుండా అందరూ పాల్గొనాలని సంజయ్ సూచించారు.