అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22న విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ క్రమంలో గుడిలో ప్రతిష్టించే బాల రాముని విగ్రహం ఎంపిక ఈ రోజు జరగనుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సమావేశంలో నిర్వహించే ఓటింగ్ లో శిల్పులు రూపొందించిన 3 విగ్రహాల్లో ఒక దాన్ని ఎంపిక చేయనున్నారు. ఎక్కువ ఓట్లు వచ్చిన విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు.
విగ్రహ ప్రతిష్టాపన కోసం 51 అంగుళాలున్న ఐదేళ్ల వయసున్న రాముని 3 విగ్రహాలను శిల్పులు రూపొందించారు. ఈ విషయాన్ని ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ ప్రకటించారు. బాల రూపంలో ఉన్న రాముని దైవత్వం కళ్లకు కట్టినట్లు కనిపించే విగ్రహాన్ని ఎంపిక చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పట్టాభిషేక మహోత్సవానికి ముహూర్తం దగ్గరపడుతుండటంతో రామ జన్మభూమి మార్గం, ఆలయ సముదాయంలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. వాటిని శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పనులు వేగంగా పూర్తి చేయడం కన్నా నాణ్యతపైనే దృష్టి పెట్టామని చెప్పారు.
ఇదిలా ఉంటే అయోధ్య రామ మందిరంలో 7 రోజుల పాటు పవిత్రోత్సవం జరగనుంది. జనవరి 16న ప్రాయశ్చిత్త కార్యక్రమంతో ఈ క్రతువు ప్రారంభం అవుతుంది. ఈ వేడుకలో బాలరాముని విగ్రహం ఊరేగించనున్నారు. ఆచార స్నానాలు, పూజలు, అగ్ని ఆచారాలు వరుసగా నిర్వహిస్తారు. జనవరి 22న మధ్యాహ్నం మృగశిర నక్షత్రాన బాల రాముడు ప్రాణ ప్రతిష్ట జరగనుంది.