Supreme Court : ఏం చేస్తారో? ఎలా చేస్తారో ? అనవసరం.. కాలుష్యాన్ని ఆపండి.. సుప్రీం
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం నెలకొన్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కాలుష్యానికి కారణమైన పంట వ్యర్థాలను కాల్చడాన్ని ఆపాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అన్నివేళలా రాజకీయ పోరాటం ఉండకూడదని సూచించింది.
విచారణ సందర్భంగా ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ పంజాబ్ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. పంట వ్యర్థాలను తగులబెడుతున్న ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతోందని ప్రశ్నించింది. “ఇది ప్రజల జీవితాలకు సంబంధించిన సమస్య. పరస్పర రాజకీయ విమర్శలు, నిందారోపణలు మాని పరిష్కారంపై దృష్టి పెట్టాలి” అంటూ వ్యాఖ్యానించింది. “బలవంతపు చర్యలు చేపడతారో లేక ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ప్రత్యామ్నాయ పద్ధతులు అమలు చేస్తారో మాకు తెలియదు. కానీ తక్షణమే ఈ చర్యలకు అడ్డుకట్ట వేయాలి” అంటూ ఆదేశాలు జారీ చేసింది. ‘‘పంట వ్యర్థాలను కాల్చడం ఆపాలని మేం కోరుకుంటున్నాం. మీరు ఎలా చేస్తారో ? ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ ఇది మీపని. కాబట్టి దాన్ని మీరు ఆపాలి. వెంటనే ఏదో ఒకటి చేయాలి’’ అని ఆదేశాలు జారీ చేసింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యానికి కారణమవుతున్న పంట వ్యర్థాలను తగులబెట్టే ఘటనలు ఇటీవల వెలుగుచూసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
గత వారం పది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్యం కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. అక్కడ వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిని మించి నమోదవుతోంది. గాలి విషపూరితంగా మారిపోవడంతో జనం ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేకుండా పోయింది. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతో పాఠశాలలకు సెలవులను ప్రకటించారు. నిర్మాణ కార్యకలాపాలను కూడా నిషేధించారు.