అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి?

Update: 2023-07-26 09:47 GMT

మణిపూర్ హింసపై పార్లమెంటు అట్టుడుకుతోంది. ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సభాకార్యక్రమాలను స్తంభింపజేస్తున్నాయి. అయినా ప్రధాని మోడీ మౌనం వీడకపోవడంతో విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. నోటీసుపై స్పందించిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చర్చకు అనుమతించారు. అన్ని పార్టీలతో సమావేశమై చర్చ తేదీ ప్రకటిస్తానని చెప్పారు. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకీ అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి? అసలు ఎందుకు పెడతారు..?

అవిశ్వాసం అంటే...

రాజ్యాంగంలోని 75(3) అధికరణం ప్రకారం మంత్రి మండలి లోక్‌సభకు బాధ్యత వహిస్తుంది. లోక్‌సభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నంత వరకే ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది. ప్రభుత్వంపై విశ్వాసం లేనప్పుడు సభ్యులు రూల్ 198 కింద నోటీసు ఇచ్చే అవకాశముంది. నిబంధనల మేరకు తీర్మానం ప్రవేశపెడితే స్పీకర్ అందుకు అనుమతిస్తే పాలకపక్షం బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది. నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టేందుకు ఎలాంటి కారణం చెప్పాల్సిన అవసరం లేదు.

స్పీకర్ అనుమతితో

సభలో సభ్యులెవరైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టొచ్చు. అయితే లోక్ సభలో తప్ప రాజ్యసభలో అవిశ్వాసం ప్రవేశపెట్టే అవకాశం లేదు. సభ్యుడు నోటీసును ఉదయం 10 గంటల్లోపు రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసుపై కనీసం 50 మంది ఎంపీలు కచ్చితంగా సంతకం చేయాలి. సభ ప్రారంభమైన తర్వాత అవిశ్వాస తీర్మానం నోటీసు నిర్దేశిత విధానంలో ఉందని స్పీకర్ భావిస్తే దానిని సభలో చదవి వినిపిస్తారు. సంతకం చేసిన వారందరూ నిలబడాలని కోరుతారు. ఆ తర్వాత స్పీకర్ తీర్మానాన్ని స్వీకరించి, చర్చకు తేదీని నిర్ణయిస్తారు. ఆ తేదీ.. నోటీసు ఇచ్చిన పది రోజుల్లోపే ఉండాలి.

ప్రధాని సమాధానం

తీర్మానంపై చర్చకు స్పీకర్ కాలపరిమితి కూడా నిర్ణయించవచ్చు. ఈ చర్చలో అవిశ్వాస తీర్మానం పెట్టిన వారితో పాటు దానికి మద్దతు ఇచ్చిన వారు ప్రసంగిస్తారు. ప్రభుత్వంపై వారు చేసిన ఆరోపణలకు సాధారణంగా ప్రధానమంత్రి కానీ, మంత్రి మండలి సభ్యులు కానీ సమాధానం ఇస్తారు. చర్చ ముగిసిన అనంతరం అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ ఓటింగ్ నిర్వహిస్తారు. సాధారణంగా మూజువాణి ఓటు ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు. ఒక్కోసారి సభ్యుల విభజన ద్వారా ఓటింగ్ జరగవచ్చు. అందులో మెజారిటీ సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే. ప్రభుత్వం దిగిపోవాల్సి ఉంటుంది. మెజారిటీ సభ్యులు తీర్మానాన్ని వ్యతిరేకిస్తే తీర్మానం వీగిపోతుంది.

Tags:    

Similar News