Liquor scam case : ఈడీ విచారణకు మళ్లీ డుమ్మా.. కేజ్రీవాల్ అరెస్ట్ తప్పదా..?

Update: 2024-01-03 07:00 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ రోజు విచారణకు రావాలని ఆదేశించారు. అయితే కేజ్రీవాల్ మాత్రం ఈడీ విచారణకు మరోసారి విచారణకు డుమ్మా కొట్టారు. తాను విచారణకు హాజరుకావడం లేదని ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో కలుపుకొని ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొట్టడం మూడోసారి.

మరోవైపు ఈడీ సమన్లపై ఆప్‌ తీవ్రంగా స్పందించింది. ఈ నోటీసులు అక్రమమని, కేజ్రీవాల్ను అరెస్ట్‌ చేసే ఉద్దేశంతోనే నోటీసులు ఇచ్చారని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు సీఎం కేజ్రీవాల్‌ సిద్ధంగా ఉన్నారని చెప్పింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో నోటీసులు పంపడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే సమన్లు పంపారని ఆమ్ ఆద్మీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ఇప్పటికే కేజ్రీవాల్‌ను గతేడాది ఏప్రిల్లో ప్రశ్నించింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన ఈడీ అక్టోబర్‌లో అరవింద్‌ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. అయితే విచారణకు ఆయన డుమ్మా కొట్టడంతో నవంబర్‌ 2న రెండోసారి సమన్లు పంపింది. ఈ రెండోసారి సైతం కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకాలేదు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున ఈడీ విచారణకు రాలేనని చెప్పారు. ఈ క్రమంలో ఈడీ మూడోసారి నోటీసులు పంపగా కేజ్రీవాల్‌ విచారణకు హాజరుకాబోనని సమాచారం ఇచ్చారు.

కేజ్రీవాల్ పదే పదే విచారణకు డుమ్మా కొడుతున్న నేపథ్యంలో ఈడీ కోర్టును ఆశ్రయించే అవకాశముంది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలని పిటిషన్ వేసే అవకాశముంది. ఒకవేళ కోర్టు ఎన్బీడబ్ల్యూ జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు డుమ్మా కొడితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే అవకాశముంది.




Tags:    

Similar News