CONGRESS: మణిపుర్ వెళ్లేందుకు మోదీకి టైమ్ లేదా.. కాంగ్రెస్
"ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) 4 నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతోంది. ఆ రాష్ట్రంలో నెలకొన్న కల్లోల పరిస్థితులను పరిశీలించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒక్క రోజు టైం లేదా? . దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటిస్తున్న పర్యటిస్తున్న ప్రధాని.. మణిపూర్ ను ఎందుకు విడిచిపెట్టారా? దేశంలో ఏం జరుగుతున్నా.. ప్రధాని మోదీ ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావట్లేదు" అంటూ ప్రధానిపై మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh). ప్రధానమంత్రి అధికారంలోకి రావాలని మాత్రమే ఆరాట పడుతున్నారని ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా మండిపడ్డారు.
మణిపూర్‌లో పర్యటించేందుకు మోదీకి సమయం దొరకడం లేదంటూ జైరాం రమేశ్ విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ విషయంలో ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ‘147 రోజులుగా మణిపుర్ ప్రజలు బాధపడుతున్నారు. యావత్ దేశమంతా ఆ రాష్ట్రంలో జరిగిన ఘటనలను చూసి దిగ్భ్రాంతికి గురైంది. కానీ ప్రధానికి మణిపుర్ రాష్ట్రాన్ని సందర్శించడానికి మాత్రం టైమ్ లేదు. అసలు అందమైన మణిపుర్ రణరంగంగా మారడానికి కారణం బీజేపీనే. ప్రధాని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ (N Biren Singh) ను తొలగిస్తేనే అక్కడి హింసాకాండను ఆపేందుకు మొదటి అడుగు వేసినట్లు అవుతుంది ’ అని ఖర్గే పేర్కొన్నారు.
కాగా, కుకీ, మెయిటీ కమ్యూనిటీల మధ్య నెలకొన్న ఘర్షణలతో దాదాపు నాలుగు నెలలుగా మణిపూర్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈఏడాది జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు.. సాయుధ మూకల చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. వారి మృతదేహాల ఫొటోలు ఇంటర్నెట్‌పై ఆంక్షలు ఎత్తివేయడంతో వెలుగులోకి వచ్చాయి. సోమవారం రాత్రి నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో మంగళవారం నుంచి ఇంటర్నెట్ సేవలను మరో 5 రోజుల పాటు నిలిపివేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.