వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. హాస్పిటల్ బయట బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Byline :  Kiran
Update: 2024-01-10 05:50 GMT

వైద్యో నారాయణో హరి అంటారు. అంటే డాక్టర్ దేవుడితో సమానం అని అర్థం. కానీ కొందరు వైద్యుల తీరు మాత్రం దారుణంగా ఉంటోంది. వైద్యం కోసం వచ్చిన పేషెంట్ల పట్ల దారుణంగా వ్యవహరించడం విమర్శలు దారి తీస్తోంది. హర్యానాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇలాంటి ఘటనే జరిగింది. ప్రసవ వేదనతో హాస్పిటల్కు వచ్చిన ఓ మహిళ పట్ల వైద్య సిబ్బంది దారుణంగా వ్యవహరించారు. దీంతో సదరు మహిళా గడ్డకట్టే చలిలో ఆరు బయటే బిడ్డకు జన్మనిచ్చింది.

పంజాబ్ మొహాలీకి చెందిన ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి హర్యానాకు వలస వచ్చాడు. మంగళవారం భార్యకు పురిటి నొప్పులు రావడంతో తాను కూరగాయలు అమ్మే బండిలోనే అంబాలా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. హాస్పిటల్ లోపలకు వెళ్లి వైద్య సిబ్బందికి విషయం చెప్పాడు. అయితే డ్యూటీలో ఉన్న డాక్టర్ గానీ ఇతర వైద్య సిబ్బంది గానీ అతని అభ్యర్థనను పట్టించుకోలేదు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్లమంటూ కాలయాపన చేశారు. గర్భిణిని హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లేందుకు కనీసం స్ట్రెచర్ కూడా ఇవ్వలేదు.

పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో సదరు మహిళ హాస్పిటల్ గేటు వద్దే కూరగాయల బండిలోనే బిడ్డకు జన్మనిచ్చింది. గడ్డకట్టే చలిలో వణికిపోతూ ఆ చిన్నారి ఈ లోకంలోకి వచ్చాడు. ఆరు బయట మహిళ ప్రసవించడంతో ఉన్నతాధికారులకు విషయం తెలిస్తుందన్న భయంతో డాక్టర్తో పాటు ఇతర సిబ్బంది వెంటనే తల్లీబిడ్డను వార్డులోకి షిఫ్ట్ చేశారు. ఈలోపే ఆ వార్త బయటకు పొక్కడంతో విషయం కాస్తా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ కు చేరింది. ఈ ఘటనపై సీరియస్ ఆయన.. విచారణకు ఆదేశించారు. బాధ్యతులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు హాస్పిటల్ బయట బిడ్డ జన్మించిన ఘటనపై హాస్పిటల్ ఆర్ఎంఓ సంగీతా సింగ్లా స్పందించారు. దర్యాప్తు కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో రిపోర్టు వస్తుందని దాని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనకు కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా.. వారికి వార్నింగ్ ఇస్తామని చెప్పడం విశేషం.

Tags:    

Similar News