Normal Delivery: యూట్యూబ్ ద్వారా నార్మల్ డెలివరికీ ప్రయత్నించి.. ఇద్దరి మృతికి కారణమై..
ఓ వ్యక్తి మూర్ఖత్వం.. అతని భార్యాబిడ్డల ప్రాణాలను తీసింది. పురిటి నొప్పులు వస్తున్న భార్యను.. ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే నార్మల్ డెలివరీకి ప్రయత్నించి.. ఆమెతోపాటు ఆ నవజాత శిశువు మరణానికి కారణమయ్యాడు. కేరళలోని తిరువనంతపురంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువనంతపురంలోని కరకమండపంలో నయాజ్, షమీరా అనే దంపతులు అద్దె ఇంట్లో ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం షమీరా 4 వ సారి గర్భం దాల్చింది. అయితే ఆమె భర్త నయాజ్.. గర్భంతో ఉన్న 9 నెలల కాలంలో ఒక్కసారి కూడా డాక్టర్ ని సంప్రదించలేదు. ఆక్యుపంక్చర్ వైద్యం ద్వారా ఇంట్లోనే ప్రసవించాలని ఆమెను ఒత్తిడి చేశాడు. షమీరాకు సరైన వైద్యం అందించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లమని ఆశా వర్కర్లు ఎన్నిసార్లు అడిగినా నయాజ్ అంగీకరించలేదు. ఈ క్రమంలో షమీరాకు మంగళవారం అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను కిల్లిపాలెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే తల్లీబిడ్డలు మృతి చెందారని డాక్టర్లు చెప్పారు.
షమీరా, నయాజ్ దంపతులకు ఇంతకుముందే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారికి కూడా గతంలో పోలియో చుక్కలు వేయడాన్ని నయాజ్ వ్యతిరేకించాడని ఆశా వర్కర్లు తెలిపారు. షమీరా మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని స్థానికులు అన్నారు. ఆమె మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను డిమాండ్ చేశారు. దీంతో మృతురాలి భర్త నయాజ్పై నెమోమ్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. "షమీరాను చికిత్స కోసం ఆస్పత్రి పంపేందుకు నయాజ్ నిరాకరించేవాడు. సాధారణ కాన్పు కోసమే నయాజ్ పట్టుబట్టి, దాని సంబంధిత వీడియోలు యూట్యూబ్‌లో చూసేవాడు. ఆమెను ఇరుగుపొరుగువారితో మాట్లాడేందుకు సైతం అనుమతించేవాడు కాదు. చికిత్స కోసం షమీరాను ఆస్పత్రి తీసుకెళ్లమని చెప్పిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసేవాడు" అని స్థానికురాలు చెప్పింది.