మహిళతో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన.. ఇండిగో ఫ్లైట్లో మరో ఘటన..

By :  Kiran
Update: 2023-09-11 13:21 GMT

విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. ముఖ్యంగా మహిళల పట్ల కొందరు తోటి ప్రయాణికులు వ్యవహరిస్తున్న తీరు శ్రుతి మించుతోంది. తాజాగా ముంబై నుంచి గౌహతి వెళ్తున్న ఇండిగో ఫ్లైట్లో ఇలాంటి ఘటనే జరిగింది.

ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇండిగో సంస్థకు చెందిన ఫ్లైట్ 6E-5319 ముంబై నుంచి గౌహతికి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఓ మహిళా ప్రయాణికురాలు లైట్స్‌ ఆఫ్‌ చేసి నిద్రపోయింది. అదే అదునుగా పక్క సీట్లో కూర్చున్న ఓ కేటుగాడు సదరు మహిళా ప్యాసింజర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. నిద్రపోతున్న ఆమెపై చేతులు వేసి అసభ్యకరంగా తాకాడు. తొలుత అనుకోకుండా చేయి తగిలి ఉంటుందని భావించిన ఆమె.. ఆ తర్వాత కూడా అతను అలాగే ప్రవర్తించడంతో గట్టిగా గట్టిగా అరుస్తూ లైట్స్‌ ఆన్‌ చేసింది. అనంతరం ఆ వ్యక్తిపై అక్కడున్న సిబ్బందికి ఫిర్యాదు చేసింది.

ఫ్లైట్ గౌహతి ఎయిర్పోర్టుకు చేరుకున్న వెంటనే ఎయిర్ లైన్స్ సిబ్బంది సదరు వ్యక్తిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. గత రెండు నెలల వ్యవధిలో ఇండిగో విమానంలో ఇలాంటి ఘటనలు జరగడం ఇది నాల్గోసారి కావడం గమనార్హం.

Tags:    

Similar News