ప్రపంచంలో చాలాచోట్ల పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నాయి. ఆకాశాన్నంటే బిల్డింగులు, ఊర్లను తలపించే ఆఫీసులు అన్ని దేశాల్లోనూ ఉంటున్నాయి. అయితే వాటన్నింటిలో ఇప్పటివరకూ నంబర్ వన్ గా నిలిచింది మాత్రం అమెరికాలోని పెంటగాన్ ఆఫీస్. ఇప్పుడు మన దేశంలోని ఒక కార్యాలయం దాన్ని వెనక్కి నెట్టేస్తోంది.
మనదేశంలో ఉన్న సూరత్ కు ఒక ప్రత్యేకత ఉంది. వజ్రాలకు పెట్టింది పేరు ఈ ఊరు. అందుకే దీన్ని వజ్రాల రాజధాని అని కూడా అంటారు. ఇప్పుడు దీనికి మరో ఘనత కూడా యాడ్ అయింది. ప్రపంచపు అతిపెద్ద ఆఫీస్ పెంటగాన్ ను తలదన్నేలా సూరత్ లో కొత్త ఆఫీస్ పుట్టుకొచ్చింది. వజ్రాల వ్యాపారం మరింత సులువుగా అయ్యేందుకు ఊరంత ఆఫీస్ ను కట్టారు ఇక్కడ.
ప్రపంచ మార్కెట్‌లో దాదాపు 90 శాతం వజ్రాలు సూరత్‌లోనే తయారు చేస్తారు. రోజూ వేర్వేరు ప్రాంతాల నుంచి వ్యాపారస్థులు ఇక్కడికి వస్తుంటారు. అందుకే సూరత్ డైమండ్ బోర్స్ సంస్థ.. తమ కార్యాలయాన్ని వజ్రాల నగరం సూరత్ లో నిర్మిస్తోంది. సూరత్ కు వచ్చే వజ్రాల వ్యాపారులు మరింత సులువుగా బిజినెస్ చేసుకోవటానికి వీలుగా ఈ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ నాటికి దీని నిర్మాణం పూర్తవుతుంది. ప్రధాని నరేంద్రమోడీ దీనిని ప్రారంభించనున్నారు.
మోర్ఫోజెనిసిస్ అనే ఇండియన్ ఆర్కిటెక్చర్ కంపెనీ దీన్ని డిజైన్ చేసింది. 35 ఎకరాల్లో...15 అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. రెక్టాంగ్యులర్ షేప్ లో ఉండే 9 భవనాలు ఉంటాయి. వీటన్నింటి మధ్యలో మరో పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఇది మొత్తం అన్ని భవనాలను అనుసంధానం చేస్తుంది. ఈ మొత్తం ఆఫీస్ లో 65వేల మంది వ్యాపారం చేసుకోవచ్చును. ఇప్పటికే..ఈ భారీ భవనం నిర్మాణంలో ఉండగానే చాలా వజ్రాల సంస్థలు కార్యాలయాలను కొనుగోలు చేశారు.
ఇక ఈ కాంప్లెక్స్‌లో ఏకంగా 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో .. రీక్రియేషన్ జోన్, పార్కింగ్ నిర్మిస్తున్నారు. దేశం లేదా ప్రపంచ మొత్తంలో వజ్రాల వ్యాపారం ఇక్కడ నుంచే చేసుకునేలా ఈ బిల్డింగ్ తయారవుతోంది. రోజూ రైలులో ప్రయాణించి దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మరింత సులభంగా ఇక్కడే వ్యాపారం చేసుకునే వీలు కలుగుతుంది. ఈ కార్యాలయాన్ని లాభాల కోసం ఏర్పాటు చేయలేదని ఎస్‌డీబీ స్పష్టం చేసింది.
మొత్తానికి 80 ఏళ్ళుగా అతి పెద్ద కార్యాలయంగా తనపేరును నిలబెట్టుకుంటున్న అమెరికాలోని పెంటగాన్ కీర్తి ఇక మీదట సూరత్ లో డైమండ్ బోర్స్ బిల్డింగ్ వశమవబోతోంది.