డేంజర్‌ మార్క్‌ దాటిన యమునా నది.. వణుకుతున్న ఢిల్లీ ప్రజలు

Update: 2023-07-19 06:14 GMT

ఎడతెరిపి లేని వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని నదులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యమునా నది మహోగ్ర రూపం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత కొద్దిరోజులుగా ఈ నదీ ప్రవాహం తగ్గుముఖం పట్టగా.. ఇవాళ నీటిమట్టం మళ్లీ ప్రమాదకర స్థాయిని దాటింది.

ఇవాళ ఉదయం 8 గంటల సమయానికి ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యుమనా నది నీటి మట్టం ప్రమాదకర స్థాయి దాటి 205.48 మీటర్లుగా నమోదైంది. ఈ సాయంత్రానికి ఇది 205.72 మీటర్లను చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతవారం యమునా నది నీటిమట్టం ఆల్‌టైం గరిష్ఠానికి చేరి 208.66మీటర్లుగా నమోదవడంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించింది.

ఉత్తరాది రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాల ముప్పు పొంచిఉంది. జులై 22 వరకు ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. భారీ వర్షాలు, వరదలతో హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే అతలాకుతలం అయ్యింది. ఇప్పుడు మళ్లీ వాన పొంచి ఉండడం ఆ రాష్ట్ర ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. అటు గుజరాత్‌లోనూ రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Tags:    

Similar News