గొంతులో పునుగు ఇరుక్కొని చిన్నారి మృతి..

Update: 2023-07-25 02:51 GMT

వర్షాకాలం సాయంత్రం ఆ ఇంట్లో వేడి వేడిగా పునుగులు చేస్తున్న సమయంలో 13 నెలల చిన్నారి.. తల్లికి తెలియకుండా తనంతట తాను తిన్నాడు. అది కాస్త గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయవిదారక ఘటన సిరిసిల్లా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం కేంద్రంలో మారుతి, కవితలు కూలి పనిచేసుకుంటే జీవిస్తున్నారు. వీరికి క్రాంతి అనే 13 నెలల బాలుడు ఉన్నారు.

కవిత ఇంట్లో పునుగులు చేస్తున్న సమయంలో బాలుడు వాటిని తిన్నాడు. బాలుడు తనంతట తాను పునుగును నోట్లో వేసుకోవడంతో గొంతులో ఇరుక్కుంది. పనిలో నిమగ్నమైన కవిత వెంటనే గమనించి.. క్రాంతి గొంతులో ఇరుక్కున్న పునుగును తీయడానికి ప్రయత్నం చేసింది. అయితే ఎంతకీ పునుగు గొంతులో నుంచి బయటకు రాలేదు. అప్పటికే బాలుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. దీంతో హుటాహుటిన కుర్రాడిని ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రికి వెళ్లిన తర్వాత బాలుడిని పరీక్షించిన డాక్టర్ అప్పటికే మరణించినట్లు తెలిపారు. పునుగు గొంతులో ఇరుక్కోవడంతోనే ఊపిరి ఆడక చనిపోయాడని తెలిపారు. 13 నెలల బాలుడు పునుగు ఇరుక్కొని మరణించడంతో స్థానికంగా విషాదం నెలకొంది. క్రాంతి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోవడంతో అక్కడ కలిసి రావడం లేదని ఇక్కడి వచ్చామని, కానీ ఇక్కడ కూడా అలాంటి ఘటనే ఎదురైందని బాలుడి తల్లిదండ్రులు విలపించడం చూపరులను కలిచివేసింది.

Tags:    

Similar News