MP Ticket Application : కాంగ్రెస్‌ ఎంపీ టికెట్ల కోసం గట్టిపోటీ.. ఆ 3 స్థానాలపై ప్రముఖుల గురి

Byline :  Bharath
Update: 2024-02-03 07:20 GMT

(MP Ticket Application)కాంగ్రెస్​ పార్టీ నుంచి లోక్​సభ టికెట్​ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇవాళ్టితో (ఫిబ్రవరి 3) దరఖాస్తు ప్రక్రియ ముగియనుండటంతో.. శుక్రవారం (ఫిబ్రవరి 2) ఒక్కరోజే 104 మందికి పైగా ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం, మల్కాజ్ గిరి, నల్గొండ, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాల నుంచి అధిక దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్​కు అతి తక్కువ దరఖాస్తులు వచ్చాయి. మొదటి రోజు కేవలం 7 అప్లికేషన్లు మాత్రమే రాగా.. రెండో రోజు 34, మూడో రోజు ఏకంగా 140కి పైగా దరఖాస్తులు అందాయి. గడిచిన మూడు రోజులుగా దరఖాస్తు చేసుకున్న వారిలో.. ఎక్కువగా మంత్రుల భార్యలు, ప్రభుత్వ ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, సినీ ప్రముఖులు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు పెరిగినట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపారు.

మల్కాజిగిరి పార్లమెంట్​ స్థానానికి బండ్ల గణేశ్, నాగర్​ కర్నూల్​ లోక్​సభ స్థానానికి సంపత్​ కుమార్, ఖమ్మం, సికింద్రాబాద్​ స్థానాలకు మాజీ హెల్త్​ డైరెక్టర్ ​గడల శ్రీనివాస రావు, కరీంనగర్​ పార్లమెంట్​ స్థానానికి వెలిచాల రాజేందర్​ రావు, ఖమ్మం స్థానానికి వీవీసీ గ్రూప్స్​ అధినేత రాజేంద్రపస్రాద్ దరఖాస్తు చేసుకున్నారు. ఇన్నాళ్లు బీఆర్​ఎస్ పార్టీకి​ సానుభూతిపరుడిగా ఉన్న గడల శ్రీనివాస రావు.. త్వరలో కాంగ్రెస్​ పార్టీలో చేరుతారని వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన దరఖాస్తుతో ఆ వార్త నిజమేనని తేలిపోయింది. ఇక ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని తరఫున ఆమె అనుచరులు దరఖాస్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ సైతం ఖమ్మం స్థానం కోసం అప్లై చేసుకున్నారు. భువనగిరి టికెట్ కోసం పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్‌ కుమార్ రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి మాజీ ఎంపీ మందా జగన్నాథం, మల్కాజ్‌గిరి కోసం కపిలవాయి దిలీప్‌కుమార్, నిజామాబాద్ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మల్కాజ్‌గిరి, వరంగల్ స్థానాల కోసం మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆదిలాబాద్ నుంచి ఐఆర్ఎస్ ఆఫీసర్ రాథోడ్ ప్రకాశ్, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ కార్మిక అసిస్టెంట్ కమిషనర్ కూరాకుల భారతి, పెద్దపల్లి టికెట్ కోసం ఆగమ చంద్రశేఖర్, నాగర్ కర్నూల్ టికెట్ కోసం ఆయన కూతురు ఆగమ చంద్రప్రియ అప్లికేషన్లు అందజేశారు. 




Tags:    

Similar News