ప్రజాదర్బార్కు విశేష స్పందన.. 4,471 వినతి పత్రాలు

Update: 2023-12-11 16:04 GMT

ఈ నెల 8వ తేదీన 'మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్'లో ప్రారంభించిన 'ప్రజాదర్బార్'కు విశేష స్పందన లభిస్తోంది. ప్రజలు తమకు సంబంధించిన వివిధ రకాల సమస్యలపై వినతి పత్రాలను సమర్పించేందుకు ప్రజాభవన్ కు పెద్ద ఎత్తున వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. తమ సమస్యలను గురించి సీఎం రేవంత్ రెడ్డికి చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతి పత్రాలు వస్తున్నాయి. డబుల్ బెడ్రూం ఇండ్లు, పెన్షన్లు, ఉద్యోగాలు వంటి పలు విషయాలపై ప్రజలు వినతి పత్రాలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు మొత్తం 4,471 వినతి పత్రాలు అందినట్లు ప్రజా భవన్ అధికారులు తెలిపారు.

అందులో ఇవాళ నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో 1,143 వినతి పత్రాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ఎదుట ఏర్పాటు చేసిన ముళ్లకంచెలను తొలగించింది. అనంతరం ప్రగతి భవన్ ను 'మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్'గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ప్రజలు ఎప్పుడంటే అప్పుడు ప్రజా భవన్ కు రావొచ్చని, ఎలాంటి తనను కలవడానికి ఎలాంటి ఆంక్షలు లేవని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఉన్నదే ప్రజల కోసమని, వాళ్ల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వం లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. 

Tags:    

Similar News