Independence Day: జెండా పండుగ వేళ కేసీఆర్ స్పీచ్​.. సర్వత్రా ఆసక్తి

Update: 2023-08-15 02:59 GMT

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు గోల్కొండ కోటలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ముందుగా అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లో జెండా ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్తారు. అక్కడ వీరుల స్మారకం వద్ద ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించాక.. గోల్కొండ కోటకు బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు గోల్కొండ కోటలోని రాణి మహల్ లాన్స్‌లో జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. అనంతరం ఆ వేదిక నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం చేయనున్న ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. 20 నిమిషాలకు పైగా ముఖ్యమంత్రి ప్రసంగం ఉండవచ్చని తెలుస్తోంది.

అన్ని వర్గాలకు వివిధ రకాలుగా లబ్ది చేకూర్చేలా నిర్ణయం తీసుకుంటున్న సర్కారు కనీసం స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకైనా తమ పర్మినెంట్ విషయంపై సీఎం ఏమైనా ప్రకటన చేస్తారేమోనన్న ఆశతో జీహెచ్ఎంసీ కార్మికులు ఎదురుచూస్తున్నారు. జీహెచ్ఎంసీలోని సుమారు 25 వేల పై చిలుకున్న ఔట్ సోర్స్ కార్మికుల కుటుంబాలకు చెందిన లక్షపై చిలుకు కుటుంబ సభ్యులు సీఎం ప్రసం గం కోసం ఎదురుచూస్తున్నారు. తమను పర్మినెంట్ చేస్తామన్న ఉద్యమ నేత ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ఇప్పటి వరకు ఎన్నో సార్లు కార్మికులు రకరకాలుగా ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే.

ఇక స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గోల్కొండ కోటలో ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. పోలీస్‌, వివిధ శాఖల అధికారులతో కలిసి కోటలోని ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. వేడుకల కారణంగా ఏఏ ఏరియాల్లో ట్రాఫిక్ అంక్షలు ఉంటాయో ప్రజలకు తెలియజేయాలన్నారు. గోల్కొండలో జరిగే స్వాతంత్య్ర వేడుకలను వీక్షించడానికి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారని.. వాళ్లకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పని చేసి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఇక ఈరోజు సాయంత్రం రాజ్ భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు సీఎం హాజరవుతారో? లేదో అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు.

Tags:    

Similar News