పెళ్లై 18, 15 ఏళ్ల కొడుకులు.. 13 ఏండ్ల బాలికతో బాల్య వివాహం

Update: 2023-07-09 03:58 GMT

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అబ్బాపూర్ తండాలో శుక్రవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. గుట్టుచప్పుడు కాకుండా అర్థరాత్రి వేళ 13 ఏళ్ల మైనర్ బాలికను పెళ్లాడాడు 45 ఏండ్ల పెద్దమనిషి. ఈ పెళ్లి విషయం గురించి తెలుసుకున్న స్థానిక అంగన్‌వాడీ టీచర్‌తో పాటు పలువురు.. ఆ రాత్రి వేళ వెంటనేజిల్లా బాలల పరిరక్షణ అధికారులు, పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అబ్బాపూర్‌(బి)కు చేరుకునేలోపే పెళ్లి జరిగిపోయింది. అధికారులు వస్తున్నట్లు తెలియడంతో సదరు పెళ్లికొడుకు కారులో బాలికను గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లిపోయాడు. ఈ పెళ్లికి గ్రామ పెద్దలు సైతం సహకరించినట్లు తెలిసింది.

జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్యకుమార్‌, స్థానికులు తెలిపిన ప్రకారం.. అబ్బాపూర్‌ (బి) తండాకు చెందిన 13 ఏళ్ల బాలిక చదువు మధ్యలోనే మానేసింది. ఆమెకు కోస్లీ పంచాయతీ పరిధిలోని మాన్‌సింగ్‌ తండాకు చెందిన సాయబ్‌ రావు అనే 45 ఏళ్ల వ్యక్తితో శుక్రవారం రాత్రి పెళ్లి జరిపేందుకు నిశ్చయించారు. అతడికి అప్పటికే పెళ్లయి 18, 15 ఏళ్ల వయసు కొడుకులున్నారు. భార్య గతంలోనే చనిపోయింది. రెండో పెళ్లి కోసం కూతురు వయసున్న 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడు. సదరు మైనర్ బాలికకు తల్లి లేకపోవడం, తండ్రి పేదవాడు కావడంతో... సాయబ్ రావు ఎదురు కట్నం కింద రూ.60వేలు ఇచ్చి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది.

బాల్యవివాహం గురించి తెలుసుకున్న గ్రామానికి చెందిన కొంతమంది యువకులు, స్థానిక అంగన్ వాడీ టీచర్ వెళ్లి బాలిక తండ్రిని, పెళ్లిపెద్దలను నిలదీయగా వారు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. దీంతో ఆ యువకులు హెల్ప్‌లైన్‌ ద్వారా పోలీసులకు, ఐసీడీఎస్‌కు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై నవీపేట్ పోలీస్ స్టేషన్ లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జిల్లా అధ్యక్షురాలు ఏ.అనిత, ప్రధాన కార్యదర్శి సుజాత ఫిర్యాదు చేశారు. అర్థరాత్రి వరకు దగ్గరుండి పెళ్లి జరిపించిన స్థానిక మహిళా ఎంపీటీసీ భర్త అయిన శంకర్ తో పాటు 60 వేలు ఎదురు కట్నం తీసుకుని స్వయంగా తన కూతురు జీవితాన్నే నాశనం చేసిన తండ్రి, అలాగే ఈ పెళ్లి జరిపించిన పంతులుపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లైంట్ చేశారు. బాల్య వివాహంపై ఐసీడీఎస్ అధికారులతో వివరాలు తెలుసుకొని అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 13 ఏళ్ల అమ్మాయిని ఫకీరాబాద్ కు చెందిన 45 ఏళ్ల వ్యక్తితో అర్ధరాత్రి పెళ్లి చేయడంపై తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాలికను కారులో ఎక్కడికో గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లాడని, అతణ్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.



Tags:    

Similar News