దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా టమాటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. టమాట కొనాలంటేనే ప్రజలు భయపడిపోయారు. ఇక ఇప్పట్లో ధర తగ్గేలా లేదని కొంత మంది టమాటాలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వినియోగదారులకు ఊరట ఇచ్చే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. టమాటా ధరలు మార్కెట్లో ఒక్కసారిగా భారీగా తగ్గుముఖం పట్టాయి. పక్క రాష్ట్రాల నుంచి టమాటా దిగుబడి పెరగడంతో ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.
దాదాపు 2 సెంచరీల వరకు వెళ్లిన టమాటా కిలో ధర ఇప్పుడు రూ.25 మాత్రమే. నిన్న మొన్నటి వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో రూ.300, తెలుగు రాష్ట్రాల్లో రూ.200 వరకుప పలికి టమాటా ఇప్పుడు మార్కెట్ లో 25, 30 రూపాయలకే లభిస్తోంది. రానున్న రోజుల్లో టమాటా ధర మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ, కర్ణాటక నుంచి భారీగా టమాటా రావడం వల్లే టమాటా ధర తగ్గిందని వ్యాపారులు తెలిపారు. మదనపల్లిలో ఇన్నాళ్లు ఆకాశాన్ని తానికి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా భారీగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం మార్కెట్ కు 4000 టన్నుల దిగుబడి రావడంతో ధర ఒక్కసారిగా పడిపోయింది. ఏపీ నుండే కాదు హైదరాబాద్ చుట్టుపక్కన ప్రాంతాలైన రంగారెడ్డి, మెదక్, వికారాబాద్ నుంచి కుప్పలుతెప్పలుగా టమాటా దిగుబడులు వస్తున్నాయి.
రెండో రకం టమాటా అయితే కిలో రూ.21కే లభిస్తుండటంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.