Tatikonda Rajaiah : బీఆర్ఎస్కు గుడ్బై చెప్పిన మాజీ డిప్యూటీ సీఎం
(Tatikonda Rajaiah) పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. బీఆర్ఎస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపనున్నారు. పార్టీ విధానాలు నచ్చకే పార్టీని వీడినట్లు ఆయన చెప్పారు. పార్టీకి వీరవిధేయుడిగా ఉన్నప్పటీకి పార్టీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ కు ఆదరణ కరువైందన్న ఆయన ఆరునెలలుగా మానసిక క్షోభకు గురవుతున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు కూల్చుతామనడం సరికాదని అభిప్రాయపడ్డారు. రీసెంట్ గా వరంగల్ ఎంపీ టికెట్ ఆశించి తాటికొండ రాజయ్య భంగపడ్డారు. పార్టీ ఏ మాత్రం స్పందించకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు కాకుండా కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏ పార్టీలో చేరుతాననేది తన సహచరులతో పాటు మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అయితే, రెండురోజుల క్రితం రాజయ్య..పొంగులేటిని కలిసినట్లు సమాచారం. ఈ నెల10న తాటికొండ రాజయ్య కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.