గుండెపోటు అనేది సర్వసాధారణమైపోయింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హార్ట్ ఎటాక్‌లకు గురవుతున్నారు. నిండా 30 ఏళ్లు దాటని యువకులు సైతం గుండెపోటుతో మరణించడం కలకలం రేపుతోంది. డ్యాన్స్ చేస్తూ, జిమ్ చేస్తూ, ఆటల ఆడిన సమయంలో పలువురు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలేస్తున్నారు. తాజాగా ఓ బీటెక్ యువకుడి గుండెపోటుతో మరణించిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
లింగంపేట మండలంలోని సురాయిపల్లి జగదాంబ తండాకు చెందిన ప్రశాంత్ బీటెక్ చివరి ఏడాది చదుతువున్నాడు. ఇటీవల క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం సాధించాడు. బెంగళూరులో ఉద్యోగం రావటంతో శుక్రవారం రాత్రి అందరికీ స్వీట్లు పంచాడు.కుటుంబమంతా సంతోషంగా రాత్రి భోజనం చేసి పడుకున్నారు. అయితే ఉదయం ప్రశాంత్ ఎప్పటికీ నిద్ర లేవకపోవడంతో..అతడి తల్లి నిద్రలేపగా అచేతనంగా పడి ఉన్నాడు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. చేతికందొచ్చిన కొడుకు అకస్మాత్తుగా చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.