హైటెక్ సిటీ ఫ్లైఓవర్పై నుంచి పడిపోయిన యువతి.. అతివేగంతో..
అతివేగం.. ఎన్నో జీవితాలను, మరెన్నో కుటుంబాలను చిదిమేసిన భూతం. ఓవర్ స్పీడ్తో వాహనాలు నడిపి ప్రాణాలు పోగొట్టుకున్న వారెందరో. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. అతివేగంగా వాహనాలు నడిపి వారి ప్రాణాలే కాకుండా పక్కవారి ప్రాణాలు తీస్తున్నారు. ఈ వేగానికి తాజాగా మరో ప్రాణం బలైంది. హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ నుంచి కిందపడి ఓ యువతి మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి.
కోల్‌కతాకు చెందిన స్వీటీ అనే యువతి తన స్నేహితుడు రాయన్ ల్యూకేతో కలిసి జేఎన్‌టీయూ నుంచి ఐకియా బైక్‌పై బయలుదేరింది. అయితే రాయన్ బైక్ను అతివేగంగా నడపడంతో అదుపు తప్పి ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్పై వెనుక కూర్చున్న స్వీటీ అమాంతం గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ కింద పడిపోగా.. రాయన్కు గాయాలయ్యాయి. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. స్వీటీ చికిత్స పొందుతూ చనిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గతనెలలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ నుంచి ఇద్దరు యువకులు కిందపడ్డారు. జులై 23 రాత్రి బైక్ పై ఇద్దరు యువకులు వేగంగా వచ్చి డివైడర్ను ఢీకొట్టారు. దీంతో ఒక ఫ్లై ఓవర్ పై నుంచి మరో ఫ్లై ఓవర్ పైకి వారిద్దరు పడిపోయారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయలయ్యాయి.