బినామీల పేర్ల మీదే 214 ఎకరాలు.. శివబాలకృష్ణ రిమాండ్ పొడగింపు
రెరా సెక్రెటరీ శివ బాలకృష్ణ కాసుల కక్కుర్తి చూసి ఏసీబీ అధికారులే షాక్ అవుతున్నారు. తవ్వేకొద్దీ ఆయన ఆస్తులు బయటపడుతూనే ఉన్నాయి. ఏసీబీ కస్టడీ ఇవాళ్టితో (ఫిబ్రవరి 7) ముగియడంతో.. మరోసారి విచారించేందుకు 14 రోజులు రిమాండ్ ను పొడగించింది. శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సురేంద్ర తెలిపారు. శివబాలకృష్ణకు చెందిన 214 ఎకరాలు, 29 ప్లాట్లు, 7 ఫ్లాట్లు, 3 విల్లాలు బినామీల పేర్ల మీద ఉన్నట్లు గుర్తించామని ఆయన చెప్పారు. లాకర్లలోనూ భారీగా బంగారం, నగదు గుర్తించినట్లు తెలిపారు. దాదాపు 8 రోజుల పాటు శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించారు. ఇవాళ్టితో ఏసీబీ కస్టడీ ముగియగా.. మరో 14 రోజులు రిమాండ్ కు నాంపల్లి కోర్టును అనుమతి కోరారు. దానికి కోర్టు ఒప్పుకోవడంతో అధికారులు రిమాండ్ ను పొడగించారు.
దీంతో శివ బాలకృష్ణను చంచల్ గూడ జైలుకు తరలించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో శివ బాలకృష్ణ పెట్టుబడులపై అధికారులు ఇంకా ఆరా తీయనున్నారు. శివ బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ని ఏసీబీ విచారించింది. శివ సునీల్ పేరుపై భారీగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై మరింత గుట్టు లాగేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు రేరా ఆఫీసులో శివ బాలకృష్ణ లాకర్ ఏసీబీ ఓపెన్ చేసింది. లాకర్లో కీలకమైన భూముల పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకుంది. రూ.12 లక్షల చందనపు చీరలు, 20లక్షల నగదును అధికారులు సీజ్ చేశారు. ఆయనకు ఎవరెవరు బాలకృష్ణకు బినామీలుగా ఉన్నారన్న దానిపై విచారణ చేస్తోంది. తన కుటుంబ సభ్యుల పేర్లతో కొనుగోలు చేసిన భూములే కాకుండాబినామీల పేర్లతో భూములను బాలకృష్ణ రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. బినామీల పేర్లతో పలు భూమి పాసుపుస్తకాలు దొరికాయి. త్వరలో వారిని కూడా విచారించే అవకాశం ఉంది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌ను విధించింది. అదేవిధంగా 8 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. గత మూడు రోజుల నుంచి శివబాలకృష్ణను అధికారులు విచారించారు. బాలకృష్ణకు భారీగా అక్రమాస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించడమే కాకుండా వందలాది డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.