రెరా సెక్రెటరీ శివ బాలకృష్ణ కాసుల కక్కుర్తి చూసి ఏసీబీ అధికారులే షాక్ అవుతున్నారు. తవ్వేకొద్దీ ఆయన ఆస్తులు బయటపడుతూనే ఉన్నాయి. ఇవాళ నాలుగో రోజు ఏసీబీ ఆయన్ని విచారించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో శివ బాలకృష్ణ పెట్టుబడులపై అధికారులు ఆరా తీశారు. రియల్ ఎస్టేట్లో ఆయన పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. శివ బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ని ఏసీబీ విచారించింది. శివ సునీల్ పేరుపై భారీగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై మరింత గుట్టు లాగేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు రేరా ఆఫీసులో శివ బాలకృష్ణ లాకర్ ఏసీబీ ఓపెన్ చేసింది. లాకర్లో కీలకమైన భూముల పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకుంది. రూ.12 లక్షల చందనపు చీరలు, 20లక్షల నగదును అధికారులు సీజ్ చేశారు. శివ బాలకృష్ణ బినామీల గురించి ఏసీబీ ఆరా తీస్తోంది. ఆయనకు ఎవరెవరు బాలకృష్ణకు బినామీలుగా ఉన్నారన్న దానిపై విచారణ చేస్తోంది. తన కుటుంబ సభ్యుల పేర్లతో కొనుగోలు చేసిన భూములే కాకుండాబినామీల పేర్లతో భూములను బాలకృష్ణ రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. బినామీల పేర్లతో పలు భూమి పాసుపుస్తకాలు దొరికాయి. త్వరలో వారిని కూడా విచారించే అవకాశం ఉంది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌ను విధించింది. అదేవిధంగా 8 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. గత మూడు రోజుల నుంచి శివబాలకృష్ణను అధికారులు విచారించారు. బాలకృష్ణకు భారీగా అక్రమాస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించడమే కాకుండా వందలాది డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.