రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పర్యటిస్తుండా.. పోలీసులకు పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో హెలిక్యాప్టర్ గాలికి పోలీసులు ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో ఉప్పల్ ట్రాఫిక్ ఏసీపీకి చెయ్యి విరగగా, ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్పగాయాలైనట్లు సమాచారం. కాగా శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ముర్ము.. ఇవాళ (డిసెంబర్ 20) భూదాన్ పోచంపల్లిలో పర్యటించారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ నుంచి ముర్ము.. ఉదయం రోడ్డు మార్గంలో హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడినుంచి హెలిక్యాప్టర్ లో ఉదయం 11 గంటలకు భూదాన్ పోచంపల్లి చేరుకున్నారు. ఈ సందర్భంగా బందోబస్తుగా ఉన్న పోలీసులు.. ల్యాండింగ్ అవుతున్న హెలిక్యాప్టర్ గాలికి ఎగిరిపడ్డారు.