ఫోన్ ట్యాపింగ్ కేసు.. తప్పు ఒప్పుకున్న నిందితులు!

Byline :  Bharath
Update: 2024-03-25 12:12 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యప్తు కొనసాగుతోంది. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడటంతో.. పోలీసులు విచారణలో దూకుడు పెంచారు. ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. మంగళవారం కస్టడీ పిటిషన్ వేయనున్నారు పోలీసులు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నతో పాటు.. ప్రధాన నిందితుడు ప్రణీత్ రావును కస్టడీకి కోరనున్నారు. ఈ ముగ్గురిని కలిపి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. కాగా చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్నలు.. తమ తప్పు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేశామని అంగీకరించినట్లు అధికారులు చెప్పారు. వారిచ్చిన సమాచారం మేరకు నాగోలు మూసీ బ్రిడ్జ్ కింద హార్డ్ డిస్క్ లను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఎఫ్ఎస్ఎల్ కు పింపించారు.

విచారణ సమయంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, రాధాకిషన్ పేర్లను నిందితులు చెప్పినట్లు పోలీసులు వివరించారు. దీంతో వారిని విచారించేందుకు లుకైట్ నోటీసులు జారీ చేశారు. తొలుత ఎస్‌ఐబీలో ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టైన ప్రణీత్‌రావును విచారిస్తున్న క్రమంలో.. ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారం బయటపడింది. ఇదంతా అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు కనుసన్నల్లో జరిగినట్లు విచారణలో తేలింది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, శ్రవణ్ రావు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురు ఇప్పటికే విదేశాలకు పారిపోబడంతో.. లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.

Tags:    

Similar News