అచ్చంపేట ప్రజల దీవెనలతో బతికి బయటపడ్డానని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు అన్నారు. శనివారం జరిగిన దాడిలో గాయపడిన ఆయన చికిత్స అనంతరం ఇవాళ అపోలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ అనుచరులతో కలిసి తన కాన్వాయ్పై దాడి చేశారని ఆరోపించారు. ఆ సమయంలో తాను తన కారులో కాకుండా తన స్నేహితుడి వాహనంలో ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డానని అన్నారు.
వంశీకృష్ణ అనుచరులు తనతో పాటు పార్టీ కార్యకర్తలపై తీవ్రంగా దాడి చేశారని బాలరాజు ఆరోపించారు. ఎన్నికల సమయంలో దాడులు తగవని కార్యకర్తలకు సర్దిచెప్పి తిరిగి వెళ్తున్న సమయంలో దారి కాచి దాడి చేశారని అన్నారు. వంశీకృష్ణ స్వయంగా రాయితో తనపై దాడి చేశారని చెప్పారు. గతంలో కూడా తన క్యాంప్ ఆఫీస్‌పై దాడి చేయించారన్న బాలరాజు.. ప్రజాసేవే లక్ష్యంగా బతుకుతున్న తాను కంఠంలో ప్రాణమున్నంత వరకు అచ్చంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
వలస కూలీ బిడ్డనైన తనను అచ్చంపేట ప్రజలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని బాలరాజు గుర్తు చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత దాడులు సరికాదన్న ఆయన.. పగలు.. ప్రతీకారాలు తన సంస్కృతి కాదని చెప్పారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక అంతమొందించాలనే కుట్ర పన్నుతున్నారని గువ్వల బాలరాజు ఆరోపించారు. తనపై దాడి జరిగే అవకాశముందని 10 రోజుల క్రితమే డీజీపీ, నాగర్ కర్నూల్ ఎస్పీ, స్థానిక పోలీసులకు సమాచారం అందించానని చెప్పారు. దాడి జరిగిన సమయంలో అక్కడ లేనని వంశీకృష్ణ చెబుతున్నారని, అదంతా అబద్ధమని అన్నారు.