ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బీజేపీ కార్యకర్తలు.. ఎంపీ ధర్మపురి అర్వింద్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా మండల పార్టీ అధ్యక్షులను మార్చారని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరసన చేపట్టారు. జిల్లాలోని ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13 మండలాల పార్టీ అధ్యక్షులను మార్చివేశారని ఆందోళనకారులు అంటున్నారు. ఈ విషయమై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
బీజేపీ తెలంగాణ కార్యాలయం ఇంచార్జీ ప్రకాష్ ఆందోళన చేస్తున్న వారిని కార్యాలయం నుండి బయటకు వెళ్లాలని కోరారు. బీజేపీ కార్యాలయ కార్యదర్శితో నిరసనకారులు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిరసనకారులను పిలిపించారు. నిరసనకారులతో కిషన్ రెడ్డి చర్చిస్తున్నారు.
2018 ఎన్నికల్లో ఆర్మూర్ నుండి వినయ్ రెడ్డి, బాల్కొండ నుండి వీఆర్ వెంకటేశ్వరరావు పోటీ చేశారు.ఆర్మూర్ నియోజకవర్గంలో రాకేష్ రెడ్డి బీజేపీలో చేరారు. రాకేష్ రెడ్డి బీజేపీలో చేరడం వెనుక అరవింద్ కీలకంగా వ్యవహరించారు. మరో వైపు బాల్కోండ అసెంబ్లీ నియోజకవర్గంలో మల్లికార్జున్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ రెండు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు తెలియకుండా ఇద్దరు నేతలు పార్టీలో చేరారు. ఈ విషయమై ఈ ఇద్దరు నేతలు అరవింద్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.