కాంగ్రెస్ ప్రజాగర్జనకు సర్వం సిద్ధం.. చేవెళ్ల నుంచి ఎన్నికల శంఖారావం
అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే ఉండటంతో కాంగ్రెస్ జోరు పెంచింది. కర్నాటక ఫలితాలు ఇచ్చిన జోష్ తో తెలంగాణలోనూ అధికారంలోకి రావాలని భావిస్తున్న పార్టీ అందుకు అనుగుణంగా వ్యూహాలు అమలుచేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముఖ్య అతిధిగా హాజరుకానున్న ఈ సభ నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరించనుంది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే శనివారం సాయంత్రం 3.40 గంటలకు బెంగుళూరులో బయలుదేరి.. సాయంత్రం 4.50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా సాయంత్రం 5.30గంటలకు చేవెళ్ల సభకు చేరుకుంటారు. సునీల్ కనుగోలు నేతృత్వంలో సిద్ధం చేసిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను ఖర్గే ఈ సభలోనే ప్రకటిస్తారు.
భూమిపై ఎస్సీ, ఎస్టీలకు పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు కల్పించడంతోపాటు దళిత బంధు తరహాలోనే గిరిజన బంధు అమలు, ఇండ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం తదితర అంశాలపై ప్రకటన చేయనుంది. అధికారంలోకి వస్తే బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలను తీసుకువస్తామని కాంగ్రెస్ ప్రకటించే ఛాన్సుంది. ఎస్సీ వర్గీకరణ విషయంపై కూడా కాంగ్రెస్ ఓ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
చేవెళ్లలోని కేవీఆర్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దగ్గరుండి పనులు పర్యవేక్షించారు. ఇదిలా ఉంటే ప్రజా గర్జన సభ నేపథ్యంలో చేవెళ్లలో ఎటు చూసినా కాంగ్రెస్ జెండాలే కనిపిస్తున్నాయి. పోలీస్ అకాడమీ నుంచి చేవెళ్ల వరకు రోడ్డుకు ఇరువైపులా భారీ కటౌట్లు, బ్యానర్లు నిండిపోయాయి.