Asaduddin Owaisi :ఎందుకు జైలుకెళ్లాడో అందరికీ తెలుసు.. చంద్రబాబు అరెస్ట్పై ఒవైసీ

By :  Kiran
Update: 2023-09-26 03:42 GMT

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబుపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. రాజమహేంద్రవరం జైలులో చంద్రుడు చాలా హ్యాపీగా ఉన్నారని అన్నారు. ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో అందరికీ తెలుసని అన్నారు. సోమవారం ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. ఏపీలో ప్రస్తుతం రెండే పార్టీలు ఉన్నాయని అందులో ఒకటి టీడీపీ అయితే రెండోది వైసీపీ అని చెప్పారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందని ఒవైసీ ప్రశంసించారు. కానీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును ఎప్పటికీ నమ్మలేమని, ప్రజలు కూడా ఆయనను నమ్మొద్దని కోరారు. ఏపీలో పోటీ చేసే అంశంపైనా అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా పోటీ చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఏపీలో కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.

మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అసదుద్దీన్ ఫైర్ అయ్యారు. మజ్లిస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్న గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను కచ్చితంగా గుర్తుపెట్టుకుంటానని వార్నింగ్‌ ఇచ్చారు. తమతో స్నేహంగా ఉంటే చేయి అందిస్తామని, కానీ స్నేహం పేరుతో వెన్నుపోటు పొడిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. ఎంఐఎంతో బీఆర్ఎస్కు అవసరం ఉంటుందే తప్ప.. తమకు వారితో ఎలాంటి అవసరం లేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని అసదుద్దీన్ అన్నారు. పదవులపై తమకు ఎలాంటి ఆశలు లేవని, కేవలం పేద ప్రజల కోసమే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News