Owaisi : బీహార్ ప్రజలకు నితీశ్ క్షమాపణ చెప్పాలి.. అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్
బీహార్ ప్రజలకు నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్, పీఎం మోదీ క్షమాపణలు చెప్పాలని.. ఈ ముగ్గురూ ముఖ్యంగా నితీశ్ కుమార్ వారికి ద్రోహం చేశారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. నితీశ్ కుమార్ ని రాజకీయ అవకాశవాది అని అనడం కూడా చిన్నమాటేనని, నితీశ్ కుమార్ రికార్డులన్నీ బద్దలు కొట్టారన్నారు. నితీశ్ కుమార్ ఎప్పటికైనా మళ్లీ ఎన్డీఏలో చేరుతారని, ఇదే విషయాన్ని తాను ఎప్పట్నుంచో చెబుతున్నానని ఓవైసీ గుర్తు చేశారు. నితీశ్ కుమార్ ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని మళ్లీ బీజేపీతో చేతులు కలపడాన్ని ఓవైసీ తప్పుబట్టారు. ఇలా కూటములు మారుతూ బీహార్ ప్రజలను నితీశ్ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. బీజేపీ బీ టీమ్ ఓవైసీ అని నిన్నటి వరకు నితీశ్ కుమార్ మాట్లాడారు. ఇప్పుడేమో అదే బీజేపీతో జతకట్టడం నితీశ్‌కు సిగ్గు అనిపిస్తలేదా అని ధ్వజమెత్తారు. ఈ దేశం మొత్తం తమ చేతుల్లోనే ఉండాలని బీజేపీ అనుకుంటుంది అని ఆయన అన్నారు.
గతంలో తేజస్వి యాదవ్‌ను తమ నలుగురు ఎమ్మెల్యేలను తన వెంట తీసుకెళ్లాడని, అదే బాధ ఇప్పుడు అతడు కూడా అనుభవిస్తున్నాడా? అని తానున అడగాలనుకుంటున్నట్లు AIMIM చీఫ్ చెప్పారు. బీహార్‌లో నితీశ్ కుమార్ కేవలం కనిపించే ముఖ్యమంత్రి మాత్రమేనని.. పాలన మాత్రం అక్కడ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) , నరేంద్ర మోడీదేనని అన్నారు. నితీష్ కుమార్ జీవించి ఉన్నంత కాలం బీహార్ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. బీహార్ రాష్ట్రంలో బ్యూరోక్రసీ పెరుగుతోందని, భారతీయ ముస్లింలకు ద్రోహం చేయడానికి రాజకీయ లౌకికవాదం ఉపయోగపడుతుందని AIMIM ఎప్పుడూ చెబుతుందన్న విషయాన్ని ఒవైసీ గుర్తు చేశారు. ఇప్పుడు బీహార్ ముస్లింలు మళ్లీ ద్రోహానికి గురయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.