Revanth Reddy : లండన్‌లో సీఎం రేవంత్ రెడ్డితో అక్బరుద్దీన్ భేటీ
లండన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ భేటీ కావడం రాజకీయ వర్గల్లో చర్చనీయంగా మారింది. దావోస్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం రేవంత్ బృందం లండన్ నగరంలో పర్యటించింది. ‘హలో లండన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో అక్బరుద్దీన్ పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ రెడ్డితో ఒవైసీ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. లండన్ పర్యటనకు అక్బరుద్దీన్‌కు అధికారికంగా ఆహ్వానం అందినట్టుగా తెలుస్తోంది. లండన్ అర్బన్ లేఅవుట్ అభివృద్ధిపై ఏరియల్ స్టడీ కోసం లండన్ షార్డ్ వ్యూను సందర్శించారు. ఇద్దరు కలిసి.. 72వ అంతస్తులో నిలబడి థేమ్స్ రివర్ అందాన్ని, ఆ నది లండన్ యొక్క ఉత్తర వైపు ఓల్డ్ సిటీని, పశ్చిమ భాగాన ఉన్న మోడ్రన్ సీటీని ఎలా కలుపుతుందన్నది పరిశీలించారు.
థేమ్స్ నదిలాగే మూసీని అభివృద్ధి చేసి.. తద్వారా హైదారాబాద్ ఓల్డ్ సిటీని కూడా డెవలప్ చేయటంపై అధ్యయనం చేశారు.రాజకీయంగా ఎంఐఎం పార్టీని దగ్గర చేసుకోవాలని హస్తం పార్టీ భావిస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకుందని చెబుతున్నారు. లండన్ పర్యటనలో రేవంత్, అక్బరుద్దీన్ భేటీ కావడం చూస్తుంటే ఈ రెండు పార్టీల మధ్య ఏం జరగబోతోందనే చర్చ మొదలైంది. మూసీ నది ప్రక్షాళన పేరిట కాంగ్రెస్, ఎంఐఎం మధ్య స్నేహం కుదరబోతోందని, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎంను కలుపుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.