తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. రేపు ఫలితాలు వెలువడనున్నాయి. హ్యాట్రిక్ గెలుపుతో తెలంగాణలో చక్రం తిప్పాలని బీఆర్ఎస్ చూస్తుంటే.. ఈసారి ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్, బీజేపీ చూస్తున్నాయి. కాగా పోలింగ్ తర్వాత వెలువడ్డ సర్వేల్లో మెజారిటీ శాతం కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తుండగా.. కొన్ని మాత్రం బీఆర్ఎస్ గెలుపొందుతుందని ప్రకటించాయి. అయితే అలా వచ్చిన సర్వేల్లో చాలా తక్కువ తేడాతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య పోటీ ఉంది. 10 నుంచి 20 సీట్ల మధ్య గెలుపోటములు నిర్ణయించబడతాయని విశ్లేషకులు అంటున్న మాట. అంతేకాకుండా ఏ పార్టీకి మెజారిటీ రాదని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఏది గెలిచినా తక్కువ మార్జిన్ తోనే గెలుస్తాయని అంటున్నారు. అదే జరిగితే కచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని విశ్లేషకులు చెప్తున్న మాట. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే కచ్చితంగా 60 సీట్లు సాధించాల్సి ఉంటుంది.
కానీ బీఆర్ఎస్కు 50 నుంచి 55 సీట్లు వస్తే చాలు. ఎందుకంటే బీఆర్ఎస్కు ఎంఐఎం అండ ఉంది. ఈ రెండు పార్టీలు స్నేహపూర్వక ఒప్పందంతో బరిలోకి దిగాయి. మజ్లిస్ ఆరు లేదా ఏడుగురు స్థానాల్లో తప్పక గెలుస్తుందని ధీమాగా ఉంది. ఆ ఎమ్మెల్యేలు కచ్చితంగా కారు పార్టీకి మద్దతు తెలుపుతారు. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్, ఎంఐఎం సీట్లు కలిపినా మెజార్టీ మార్క్ రాకుంటే ఏంటనేది ఇప్పుడున్న అసలు ప్రశ్న. అప్పుడు బీఆర్ఎస్.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ లేదా బీజేపీతో కలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వస్తున్న వార్తలను బట్టి చూస్తే.. బీజేపీ, బీఆర్ఎస్ కలుస్తాయని తెలుస్తుంది. అదే జరిగితే కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితం అవుతుంది. దీంతో ఏ పార్టీ వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.