ఓటర్ కార్డులో మీ చిరునామా తప్పుగా ఉందా..? ఇలా మార్చుకోండి

Update: 2023-08-21 04:49 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లందరికీ మరోసారి తమ ఓటు హక్కును చెక్ చేసుకునే అవకాశం ఇస్తోంది. ఓటర్ల జాబితాలో పేరు లేని వారితో పాటు, ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండుతున్న వాళ్లంతా ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఈ రోజు నుంచి కల్పిస్తోంది. అంతే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఓటు ఉన్నవారు తమ చిరునామాను మార్చుకునేందుకూ వీలు కల్పించింది. ఈ మేరకు ఓటరు జాబితా సవరణ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

ఈ రోజు (ఆగస్టు 21) ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనున్నది. తొలగించిన ఓటర్లను తిరిగి చేర్చడానికి, కొత్త ఓటర్ల నమోదుకు, మార్పులు, చేర్పులకు ఈ రోజు నుంచి సెప్టెంబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణ కోసం ఈ నెల 26, 27తో పాటు సెప్టెంబర్ 3, 4న గ్రామాలు, వార్డుల్లో ఎన్నికల సంఘం ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన పరిశీలనను సెప్టెంబర్ 28 కల్లా పూర్తిచేసి.. అక్టోబర్ 4న తుది జాబితాను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం పేర్కొన్నది. అక్టోబర్ 4న ప్రకటించే తుది జాబితా ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ సారి నమోదు చేసుకునే వారికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతీ ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈసీఐ చెబుతోంది.

ప్రస్తుతం తెలంగాణలో 3.06 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల కమిషన్‌ లెక్కలు చెప్తున్నాయి. వీరిలో 1.53 కోట్ల మంది పురుషులు, 1.52 కోట్ల మంది మహిళలు, 2,133 మంది ట్రాన్స్‌జెండర్లు, 15,368 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 18, 19 ఏండ్ల వయసువారు 4.72 లక్షల మంది, 80 ఏండ్లు పైబడినవారు 4.79 లక్షల మంది, వికలాంగులు 4.98 లక్షల మంది ఉన్నట్టు గుర్తించారు.

Tags:    

Similar News