తెలంగాణలో గెలుపే లక్ష్యంగా మిషన్ 90 నినాదంతో బీజేపీ ముందుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో దూకుడు పెంచింది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన కీలక నేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. భారీ బహిరంగసభలతో ప్రజలతో మమేకం కానున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెలలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది.
ఈ నెల 15న భద్రాచలంలో రాములవారి దర్శనంతో అమిత్ షా పర్యటన ప్రారంభం కానుంది. దీనికోసం 15న ఉదయం 11గంటలకు స్పెషల్ ఫ్లైట్లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు అల్పాహారానికి కేటాయించారు. ఈ సమయంలో కీలక నేతలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 1.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి భద్రాచలానికి బయల్దేరతారు.
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.20 మధ్యలో రాములవారిని అమిత్ షా దర్శించుకోనున్నారు. రాములోరికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. సభ అనంతరం సాయంత్రం 6 గంటలకు తిరిగి శంషాబాద్‌కు బయలుదేరుతారు. రాత్రి 7 గంటలకు శంషాబాద్ లో పలువురు నేతలతో భేటీ కానున్నారు. రాత్రి 9.30 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అమిత్ షా ఢిల్లీకి తిరిగి వెళ్తారు.
సభ అనంతరం అమిత్ షా కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఆయన స్పష్టతనిచ్చే అవకాశముంది. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ గా నియమిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నేతలతో అమిత్ షా సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.