కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దైంది. ఈ నెల 29న షా తెలంగాణకు రావాల్సివుంది. అయితే తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పర్యటన రద్దు అయినట్లు బీజేపీ ప్రకటించింది. పర్యటన ఎప్పుడు ఉంటుందన్నది త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. కాగా ఈ నెల 29న ఖమ్మంలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేసింది. ఈ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ఈ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన బీజేపీ.. షా పర్యటన మాత్రం యథాతధంగా ఉంటుందని స్పష్టం చేసింది.
అమిత్ షా 29న తెలంగాణకు వచ్చి.. పార్టీ బలోపేతంపై రాష్ట్ర నేతలతో చర్చిస్తారని ఇంతకుముందు బీజేపీ తెలిపింది. ఎన్నికల దృష్ట్యా పార్టీలోని వివిధ విభాగాలతో ఆయన భేటీ అవుతారని చెప్పింది. గత నెల 15నే ఖమ్మంలో బీజేపీ సభ జరగాల్సి ఉంది. ఆ సభకు అమిత్ షానే హాజరుకావాల్సి ఉండగా.. అప్పట్లో బిపర్‌జాయ్ తుఫాన్ కారణంగా షా పర్యటన రద్దయింది. ఇప్పుడు మరోసారి వర్షాల వల్ల షా పర్యటన రద్దు కావడం గమనార్హం.
రాష్ట్ర బీజేపీలో లుకలుకలు, ఎన్నికలు దగ్గరుపడుతున్న సమయంలో అమిత్ షా పర్యటపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అసంతృప్తి నేతలతో మాట్లాడడంతోపాటు పార్టీ బలోపేతంపై రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. అంతేకాకుండా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని వస్తున్న విమర్శలపై ఆయన ఎటువంటి క్లారిటీ ఇస్తారనేది సస్పెన్స్గా మారింది. షా పర్యటన రెండోసారి రద్దుకావడంతో మళ్లీ ఎప్పుడు ఉంటుందనేది క్లారిటీ రావాల్సి ఉంది.