ఏపీ పరిపాలన విశాఖపట్నం నుంచే సాగుతుందని సీఎం జగన్ సహా పలువురు మంత్రులు, వైసీపీ నేతలు చెప్పబట్టి మూడేళ్లు కావస్తోంది. అయితే ఇంతవరకు ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్టు కనిపించడం లేదు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ అంశాన్ని సాగదీస్తారని భావిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ముఖ్యమంత్రి నివాసం వైజాగ్‌కు మారుతుందని నేతలు చెప్పినా అదీ నిజం కాలేదు. తాజాగా ఈ వ్యవహారంలో కీలక కదలిక వచ్చింది. ప్రభుత్వ శాఖలకు విఖాఖలో భవనాలను కేటాయించారు. ఆయా శాఖల మంత్రులకు, ఉన్నతాధికారులకు, కార్యదర్శులకు మకాం దొరికింది. 35 శాఖలకు కార్యాలయాల కోసం, వసతి కోసం 35 భవనాలను కేటాయించారు. రుషికొండ మిలీనియం టవర్స్‌లోని ఏ, బీ బ్లాక్ భవనాలు, ఆంధ్రా యూనివర్సిటీ, రుషి కొండ, చినగదిలి, ఎండాడల్లోని ఆఫీసులు ఏర్పాటు చేశారు. వీటి విస్తీర్ణం 2.27 లక్షల చదరపు అడుగులు. ఆర్థిక, మునిసిపల్ శాఖల కమిటీ సిఫార్సులో కేటాయింపు జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది.
రుషికొండ రిసార్టు భవనాల్లో సీఎం, మంత్రుల క్యాంపు కార్యాలయాలును ఏర్పాటు చేస్తారు. అక్కడ పార్కింగ్, ఇతర వసతి సదుపాయాలకు ఇబ్బంది లేదని అభికారులు చెబుతున్నారు. సీఎం కుటుంబం కోసం బీచ్ ఎదురుగా విజయనగర బ్లాక్‌ను 3,764 చ.మీ.లతో భవనాన్ని నిర్మిస్తారు. సీఎం విమానాశ్రయం నుంచి రుషికొండకు హెలికాప్టర్ ద్వారా చేరుకునేలా బీచ్‌లోని హెలిప్యాడ్ కూడా ఏర్పాటు కానుంది.