టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి అధ్యక్షతన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనుక్షణం ఎంతో శ్రమకోర్చి విధులను నిర్వహించే పోలీసులను అసభ్య పదజాలం ఉపయోగించడం దారుణమని భాస్కర్ రెడ్డి అన్నారు. రేవంత్ వ్యాఖ్యలు పోలీసులతో పాటు, వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో మానసిక క్షోభకు గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా నేతలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న పోలీసుల పేర్లు రెడ్ డైరీలో రాసి పెట్టుకుని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి మిత్తితో సహా కలిపి చెల్లిస్తామని కామెంట్స్చేశారు. రేవంత్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ పట్వారి నాగర్కర్నూల్పీఎస్లో కంప్లైంట్ చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.