పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. వరుసగా ఒక్కొక్కరే బీఆర్ఎస్ పార్టీని వీడుతూ కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటుగా ఆయన కోడలు జడ్పీ చైర్ పర్సన్ అయిన తీగల అనితా రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు.
తాను, తన కోడలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా, నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకే తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. బుధవారం ఈ విషయంపైనే మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్‌ను కలిసి చర్చించామన్నారు. నియోజకవర్గంలో జరిగిన అవినీతి, అక్రమాలపై పోరాడుతానని తెలిపారు.
నియోజకవర్గంలో కబ్జాలకు గురైన చెరువులు, కుంటలతో పాటుగా ప్రభుత్వ భూములను పరిశీలించేందుకు త్వరలో మంత్రుల బృందం పర్యటిస్తుందన్నారు. ఆ సమయంలో అవినీతి అంతా బయటపడుతుందన్నారు. జిల్లా అభివృద్ధికి తాను కేఎల్ఆర్‌తో కలిసి పనిచేస్తానని, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తమ కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీని వీడనున్న తీగల
— Telugu Scribe (@TeluguScribe) February 15, 2024
బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మరియు ఆయన కోడలు జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి. pic.twitter.com/1dDJAMMYs1