ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెప్పారు. కఠిన చర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ మార్గదర్శి ఎండీ సీహెచ్.శైలజా కిరణ్‌కు వ్యతిరేకంగా లుకౌట్ సర్క్యులర్ (ఎల్వోసీ) జారీ వ్యవహారంపై క్షమాపణ లేఖలను తెలిపారు. మార్గదర్శి ఎండీకి లుకౌట్ సర్క్యులర్ జారీలో ధర్మాసనం ఉత్తర్వుల పట్ల ఎలాంటి అవిధేయత లేదని చెప్తూ.. క్షమాపణలు చెప్తూ లేఖలు అందించారు. తమ లేఖలను అంగీకరించాలని న్యాయస్థానాన్ని కోరారు.
లుకౌట్ సర్క్యులర్ జారీ చేసిన విషయంలో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లపై జస్టిస్ కె.సురేందర్ విచారణ చేపట్టారు. అధికారులు సమర్పించిన క్షమాపణ లేఖలను సీఐడీ తరుపు న్యాయవాది ధర్మాసనానికి అందించారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి.. అఫిడవిట్ దాఖలు చేయకుండా లేఖలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. క్షమాపణను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని సీఐడీ అధికారులను ఆదేశిస్తూ.. విచారణను డిసెంబర్ 29కి వాయిదా వేశారు.